Supreme Court | న్యూఢిల్లీ : అత్యాచార కేసుల విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు ఇటీవల చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పీజీ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ బాధిత మహిళే కోరి సమస్యను కొని తెచ్చుకుంది అంటూ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. అదే హైకోర్టు మార్చి 17న ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్టు వచ్చిన ఆరోపణల కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తూ వక్షోజాలను పట్టుకోవడం, పైజామా ముడిని లాగడం అత్యాచారంగా పరిగణించలేమంటూ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఆ కేసు విచారణ సందర్భంగా మంగళవారం హైకోర్టు తాజా వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించింది.
ఆమే కోరి సమస్యను కొని తెచ్చుకుంది అంటూ ఏమిటీ వ్యాఖ్యలు? అటువంటి విషయాలు మాట్లాడే సమయంలో న్యాయమూర్తులు జాగ్రత్తగా ఉండాలి అంటూ ధర్మాసనం హెచ్చరించింది. మార్చి 17న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుపై చేపట్టిన సుమోటో కేసుకు తాజా వ్యాఖ్యలను ధర్మాసనం జతచేసింది. ఎటువంటి సందేశాన్ని ఈ వ్యాఖ్యలు పంపిస్తాయని ధర్మాసనం ప్రశ్నించింది. మద్యం మత్తులో ఉన్న తనపై అత్యాచారానికి పాల్పడినట్టు ఢిల్లీలో పీజీ విద్యార్థిని ఫిర్యాదు చేయగా పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. నిందితుడికి బెయిల్ మంజూరు చేసే సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కుమార్ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.