గంగాధర, ఏప్రిల్ 22 : తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు జీవధార అని, తెలంగాణకు గుండెకాయ కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రభుత్వం అసత్య ప్రచారాన్ని మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బుధవారం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పటాకులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టని అన్నారు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా బోగస్ అని, చెత్తబుట్టలో వేయాల్సిందేనని దుయ్యబట్టారు. కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బ తీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొడుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి పొనుగోటి కృష్ణారావు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ కోఆప్షన్ సభ్యుడు అజ్జు, మాజీ సర్పంచ్ శివప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు.