2154 కొత్త రైతులకు యాసంగి సాయం
జిల్లా వ్యాప్తంగా 42,445 మందికి రైతుబంధు
ఇతర పంటలపై మొగ్గుచూపుతున్న రైతులు
మేడ్చల్, డిసెంబర్ 26(నమస్తే తెలంగాణ): యాసంగిలో రైతులు ఇతర పంటలు సాగుచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వం కూడా రైతులకు కావాల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నది. ఇతర పంటల సాగుపై వ్యవసాయ శాఖ అధికారులు కూడా గ్రామాలకు వెళ్లి నేరుగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వం కూడా వ్యవసాయం పెట్టుబడికి రైతుబంధు పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం చేస్తున్నది. దీంతో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ప్రతి యేటా పెరుగుతున్నది. యాసంగి పంట పెట్టుబడి సహాయానికి మేడ్చల్ జిల్లాలో కొత్తగా 2154 మంది రైతులు రైతు బంధు పథకంలో నమోదైనట్లు వ్యవసాయాధికారులు వెల్లడించారు. జిల్లాలోని 12 మండలాల్లో 80,914 ఎకరాల విస్తీర్ణంలో రైతులు పంటలు సాగుచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వం ఈనెల 28 నుంచి రైతుబంధును పంపిణీ చేయనున్నది. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 42,445 మంది రైతులకు రూ. 39.52 కోట్లు, యాసంగిలో కొత్తగా నమోదైన 2154 మంది రైతులకు కూడా రూ.56.37 లక్షలు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
యాసంగిలో ఇతర పంటల సాగుకు..
యాసంగిలో ఇతర పంటల సాగుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యాసంగిలో వరి కొనుగోలు చేయబోమని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రైతులు వరి వేసి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఇతర పంటల వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుత సీజన్‌కు అనువుగా ఉండే పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో రైతులు వరికి బదులుగా ఇతర పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.
రైతుబంధుతో ప్రోత్సాహం
రైతుబంధు పథకంతో రైతులకు వ్యసాయంపై ఇష్టం పెరిగింది. ప్రసుత్త పరిస్థితుల్లో వరికి బదులుగా ఇతర పంటలు వేయాలని ప్రభుత్వ సూచించింది. ఈ మేరకు రైతులు పంటల మార్పిడికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహాయం అందిస్తున్నది. -నారెడ్డి నందారెడ్డి, రైతుబంధు జిల్లా కన్వీనర్
రైతుబంధువల్లే విస్తీర్ణం పెరుగుతుంది
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం వల్లే ప్రతి యేటా వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతూ వస్తుంది. గతంలో పెట్టుబడికి పైసలు లేక పంటలు సాగుచేయలేదు. వానకాలం, యాసంగి పంటలకు రెండుసార్లు ఎకరాకు రూ.5వేల చొప్పున అందించి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. -కటికం శ్యామల, మూడుచింతలపల్లి మండల రైతుబంధు కన్వీనర్
ఇతర పంటల వైపు..
ప్రస్తుత పరిస్థితులను అర్థం చేసుకుంటున్న రైతులు వరికి బదులుగా ఇతర పంటల వైపు మొగ్గు చూపుతున్నారు. వరికి బదులుగా ఇతర పంటలు వేసి ఆదాయం పెంచుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. రైతులు కూడా ఇతర పంటలు సాగుచేసేందుకు ఇష్టపడుతున్నారు.
– వంగ పెంటారెడ్డి, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్