ఖిలావరంగల్, మార్చి 09: వరంగల్, కరీంనగర్, నిజిమాబాద్ ఉమ్మడి జిల్లాల్లో జరిగిన సీఎంఆర్ స్కాంపై (CMR scam)సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తున్నట్లు వినియోగదారుల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. ఆదివారం శివనగర్‌లోని వరంగల్ ఉమ్మడి జిల్లా సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మంది రైస్ మిల్లర్లు కోట్లాది రూపాయాల దోపిడికి పాల్పడారని ఆరోపించారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినా చర్యలు శూన్యమని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, కొంత మంది ఉన్నతాధికారుల అండదండలు ఉండడం వల్ల సంబంధిత మిల్లులపై చర్యలు తీసుకోకుండా వారికే సీఎంఆర్ వడ్లు కేటాయించారన్నారు.
ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మిల్లులకు సంబంధిత అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారన్నారు. సూర్యపేట జిల్లాలో సీఎంఆర్ మిల్లర్ల దోపిడి, అధికారుల సహకారంపై స్వచ్ఛంద సంస్థలు సీపీఐని ఆశ్రయించగా వారు విచారణ జరుపుతున్నారన్నారు. ఇదే తరహాలో అక్రమార్కులకు అండగ నిలబడిన అధికారులు, మిల్లర్లపై ఈ నెల 25న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సమావేశంలో తీర్మానించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు మురారిశెట్టి యశ్వంత్‌కుమార్, రంగరాజు, ఆనందరావు, రాయబారపు భిక్షపతి, బండి అనిల్‌కుమార్, మృదుల, సమాఖ్య సభ్యులు చిలువేరు ప్రవీణ్‌కుమార్, రాజేష్, భార్గవ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.