మరికల్ : గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థులు ( Tenth Class) అత్యధిక మార్కుల సాధనకు కృషి చేయాలని నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ( Collector Sikta Patnaik) సూచించారు. మరికల్ మండల కేంద్రంలోని పీఎం శ్రీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కోటకొండ మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నత విద్యాభ్యాసానికి పదోతరగతి తొలిమెట్టని పేర్కొన్నారు. 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించేందుకు కష్టపడాలని సూచించారు. అనంతరం ప్రిన్సిపల్ శ్రీలతతో మాట్లాడుతూ విద్యార్థుల సంఖ్యను, వారికి సరిపడే తరగతి గదులు, మరుగుదొడ్లు వివరాలను ఆరా తీశారు. ప్రైవేట్ భవనం కావడంతో సరిపడ భవనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. భవన యజమానితో కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని ఆదేశించారు.
ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు అందిస్తామని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం వంటసామాగ్రి, వంటగది ని, సరుకులను పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందించాలని సూచించారు. కాంపౌండ్ వాల్ ఎత్తు ఎత్తు తక్కువగా ఉండటం వల్ల కొంత సమస్య ఉందని తెలిపారు. కిచెన్ గార్డెన్, ఇంటర్ తరగతి గదులను కలెక్టర్ పరిశీలించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రామకోటి, ఆర్ఐ సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు.