కట్టంగూర్, ఫిబ్రవరి 21 : చట్టాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని లీగల్ సర్వీసెస్ కమిటీ ఎక్స్ ఆఫీషియా చైర్మన్, జడ్జి మంజుల సూర్యావర్ అన్నారు. శనివారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో మండల న్యాయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన చట్టాలపై అవగాహన- న్యాయ సాక్షరత కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. సమాజంలో ప్రతి పౌరుడికి సమాన న్యాయం అందడం రాజ్యాంగ హామీ అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడమే న్యాయ సేవా సంస్థ ప్రధాన ఉద్దేశం అని తెలిపారు. కోర్టు వివాదాల పరిష్కారంలో న్యాయవాదిని అందించి న్యాయపరమైన సహాయం చేస్తున్నట్లు చెప్పారు. మైనర్ బాలురు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, అందరూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి సమయపాలనతో కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకోవాలన్నారు. మాతృ భాష మన ఆత్మగౌరవానికి ప్రతీక అని మాతృభాషను మరువకూడదన్నారు. విద్యార్థులకు కవిత, పద్య పోటీలు నిర్వహించి ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముక్కాము శ్యామల శేఖర్, ఎంఈఓ అంబటి అంజయ్య, ఎస్ఐ మునుగోటి రవీందర్, ఉప సర్పంచ్ రాంబాబు, పాఠశాల చైర్మన్ పద్మావతి, న్యాయవాదులు శేరి ఛత్రపతి, వీరస్వామి, వెంకన్న, ఉపాధ్యాయులు కొంక ఆంథోని, మహమ్మద్ అబ్దుల్ గఫూర్, చిన్ని శ్రీనివాస్ పాల్గొన్నారు.