హనుమకొండ చౌరస్తా : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజాపాలన కమీషన్ల పాలనలా ఉన్నదని కేయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. రాష్ర్టంలో 20 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో రేవంత్రెడ్డి సర్కారు చెలగాటమాడుతోందని, వెంటనే అన్ని కోర్సులకు సంబంధించిన పెండింగ్ రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించాలని కాకతీయ యూనివర్సిటీ దూరవిద్య ప్రాంగణం వద్ద కేయూ ఐక్యవిద్యార్థి సంఘాల నాయకుల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఐక్య విద్యార్థి సంఘాల నాయకులు బొచ్చు తిరుపతి, ఆరెగంటి నాగరాజు, దొగ్గెల తిరుపతి, మర్రి మహేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీల్లోని కాలేజీల్లో అన్ని కోర్సులకు సంబంధించి విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.8500 కోట్లను చెల్లించకుండా రేవంత్రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని అవలంబిస్తుందని విమర్శించారు. ఒక పక్క బడ్జెట్ లేదంటూనే మూసీ ప్రక్షాళన, ప్రాజెక్టుల పేరు మీద వేలకోట్ల రూపాయలు కేటాయించే రేవంత్రెడ్డి.. తన వద్ద ఉన్న విద్యాశాఖకు సంబంధించిన పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ దారుణమన్నారు.
రేవంత్ సర్కారు తీరుతో ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక బంద్కు పిలుపునిచ్చే పరిస్థితి రాష్ర్టంలో నెలకొందన్నారు. ప్రభుత్వం.. ప్రైవేటు కాలేజీల యజమాన్యంతో మాట్లాడి రూ.600 కోట్లు దసరా తర్వాత, మరో రూ.600 కోట్లు దీపావళి తర్వాత ఇస్తామని ఒప్పించిందని, కానీ వారు విడుదల చేస్తామన్న రూ.600 కోట్లు విద్యార్థి లోకానికి న్యాయం జరిగేలా లేవని చెప్పారు. వెంటనే రేవంత్రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రూ.8500 కోట్లు విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న 11 యూనివర్సిటీలలోని విద్యార్థులను ఏకంచేసి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో రిసెర్చ్ స్కాలర్ కీతపాక ప్రసాద్, కదికొండ తిరుపతి, విద్యార్థి సంఘాల నాయకులు బొట్ల మనోహర్, ఎల్తూరి సాయి, ఉప్పుల శివ, కుమ్మరి శ్రీనాథ్, పెండేలా రాకేష్, బొక్క ప్రవర్ధన్, చింతం అంజనేయులు, శ్రీదేవి స్రవంతి, పట్ట శేఖర్, ఓర్స్చిరంజీవి పాల్గొన్నారు.