నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 10 : ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాల్సిందేనని ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ర్యాలీ, రాస్తారోకోలు నిర్వహించాయి. విద్యా రంగ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల బంద్ విజయవంత మైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం ఆ సంఘాల నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని పూర్తిగా విస్మరించింద న్నారు. సర్కారు పాఠశాలలను మూసివేయాలనే కుట్ర ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, విద్యార్థులకు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయాలని కోరారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంట నే భర్తీ చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలని పేర్కొన్నారు. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, డీఎస్ఏ, టీఎస్ఎఫ్, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ తదితర సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.