హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 22 : రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి వత్తాసు పలుకుతున్నదని వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యచరణ కమిటీ మండిపడ్డారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో ఏ.ఐ.ఎఫ్.డి.ఎస్ రాష్ర్ట కార్యదర్శి గడ్డం నాగార్జున, ఏ.ఐ.ఎస్.బి. రాష్ర్ట కార్యదర్శి హకీం నవీద్, పి.డి.ఎస్.యు. రాష్ర్ట ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, ఏఐఎస్ఎఫ్ హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి భాషాబోయిన సంతోష్, పి.డి.ఎస్.యు. హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి రాచకొండ రంజిత్ లు పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడిని అరికడుతామని, పేద, మధ్యతరగతి ప్రజలకు ఫీజుల భారం లేకుండా చూస్తామని చెప్పిన మాటలు కేవలం ప్రకటనలకే పరిమితమయ్యాయి.
ప్రైవేట్ విద్యాసంస్థల్లో వసూలు చేస్తున్న ఫీజుల వివరాలు వెంటనే ఆన్లైన్లో పెట్టాలని విద్యాశాఖ అధికారులకు చెప్పిన ప్రతిపాదనలు నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. తెలంగాణ రాష్ర్టంలోని వివిధ జిల్లాల్లో ప్రభుత్వ నియమ ,నిబంధనలు యధేచ్చగా ఉల్లంఘిస్తూ కొనసాగుతున్న ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకొని వాటి గుర్తింపును రద్దు చేయడంలో సంబంధిత విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. సేవా దృక్పథం పేరిట విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలు ధనార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ నేడు విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులు బి.వంశీకృష్ణ, బి.బాలకృష్ణ, శ్రీపతి వినయ్, రామ్‌చరణ్, బొజ్జ జ్యోతి, రోహిత్, సతీష్, నాగరాజు, డానియల్, శ్రీకాంత్, హేమంత్ పాల్గొన్నారు.