హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ) : రుణయాప్ నిర్వాహకుల వేధింపులకు మరో విద్యార్థి బలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన మురికింటి వంశీ (22) ఇంజినీరింగ్ ఫైనలియర్ చదువుతున్నాడు. ఇటీవల రుణయాప్ నుంచి రూ.10 వేలు తీసుకోగా.. రూ. లక్ష కట్టాలని నిర్వాహకుల నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. తల్లిదండ్రులకు తెలిస్తే బాధపడుతారన్న భయంతో ఈ నెల 25న ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తాను చనిపోతున్నానంటూ మెసేజ్ పంపి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి తాడేపల్లి వద్ద కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వంశీ కోసం రెండు రోజులుగా కుటుంబ సభ్యుల గాలింపు చర్యలు చేపట్టినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు తాడేపల్లిలో కృష్ణా నది వద్ద సోమవారం సెల్ఫోన్, చెప్పులు, బైక్ గుర్తించారు. నదిలో గాలించి వంశీ మృతదేహాన్ని బయటకు తీసి, కేసు దర్యాప్తు చేపట్టారు.