మహబూబ్నగర్: జాతీయ నీట్ పరీక్ష ( NEET Exam) సందర్భంగా ఆదివారం మహబూబ్నగర్ జిల్లాలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ జానకీ ( SP Janaki ) తెలిపారు . పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్అమలు, పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతంలో ర్యాలీలు( Rallys) , సభలు, మైకులతో ఊరేగింపులకు అనుమతి లేదని వెల్లడించారు. అడ్మిట్ కార్డులో పొందుపరిచిన నియమ నిబంధనలను అభ్యర్థులు తప్పకుండా పాటించాలని సూచించారు.
జిల్లాలోని 13 సెంటర్లలో 4,454 మంది విద్యార్థులు పరీక్షలో రాయనున్నారని వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. బయోమెట్రిక్ , అభ్యర్థి ఐడెంటిఫికేషన్ లో ఏదైనా సమస్య వస్తే వెంటనే సంబంధితపై అధికారులకు సమాచారం అందజేయాలని సూచించారు.
మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష సమయం ఉంటుందని అయితే అభ్యర్థులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1. 30 గంటల వరకు వరకు పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. నిర్ణీత సమయంలో అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అన్నారు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు గుర్తింపు కార్డు, రెండు పాస్ పోర్ట్ సైజు ఫొటోలు, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటోలను తప్పనిసరిగా తీసుకొని రావాలని అన్నారు.
పరీక్ష కేంద్రంలోనికి ఎలక్ట్రానిక్ పరికరాల అనుమతి లేదు
అభ్యర్థులు, ఇన్విజిలేటర్లు తమ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోనికి అనుమతించకూడదని తెలిపారు. షూస్, సాక్స్, బెల్ట్, బంగారు,వెండి, ఇతర ఆభరణాలు పరీక్ష కేంద్రంలోకి అనుమతించబడవని స్పష్టం చేశారు. ఫుల్షర్ట్స్ కి అనుమతి లేదని, హాఫ్ హ్యాండ్ షర్ట్స్ మాత్రమే వేసుకోవాలన్నారు.
పరీక్ష కేంద్రం పరిసర ప్రాంతంలో జిరాక్స్ , ఇంటర్నెట్ సెంటర్స్, ఇతర దుకాణాలు మూసి ఉంచాలని వివరించారు. స్టాంగ్ రూమ్, పరీక్ష కేంద్రం, ప్రశ్నాపత్రాలకు పూర్తిస్థాయిలో పోలీస్ బందోబస్తు నియమించామని వెల్లడించారు. పరీక్ష కేంద్రానికి చేరుకొనే సమయంలో అభ్యర్థులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆయా పరిధిలోని పోలీస్ అధికారులను సంప్రదించాలని ఎస్పీ సూచించారు.