హైదరాబాద్, మార్చి19 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ తీరుపై రాష్ట్రంలోని సాగునీటి పారుదలశాఖ ఇంజినీర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. ఇప్పటికే జలవివాదాల ఫోరంలోకి గోదావరి ప్రస్తావన తీసుకొచ్చి తప్పు చేయడమేగాక, తాజాగా అదే అంశాన్ని గవర్నర్ ప్రసంగంలోనూ పొందుపరుచడంపై నిప్పులు చెరుగుతున్నారు.
వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి గోదావరి బేసిన్లో వివాదాస్పద సమస్యలేవీ లేవు. ఏపీ ప్రభుత్వమే నిబంధనలకు, అనుమతులకు విరుద్ధంగా ప్రాజెక్టులను చేపడుతున్నది. పొరుగు రాష్ట్ర చర్యలను బేషరతుగా వ్యతిరేకించకుండా.. చర్చలకు తెలంగాణ ప్రభుత్వం ఉత్సాహం చూపడంపై మొదటి నుంచీ వ్యతిరేకత వ్యక్తమవుతూనే ఉన్నది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ సహా నీటిరంగ నిపుణులు, తెలంగాణవాదుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వచ్చాయి.
అయినా రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఏపీతో చర్చలకు అత్యుత్సాహం చూపుతూ వస్తున్నది. ఏపీ పేర్లను పంపిన వారంలోగానే రేవంత్ సర్కార్ సైతం గుట్టుగా కేంద్రానికి రాష్ట్ర అధికారుల పేర్లను ప్రతిపాదించడం, ఆ వెంటనే కేంద్రం జల్‌శక్తి శాఖ సైతం 15 మందితో సత్వరమే కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. ఈ దశలో సర్కార్ చర్యలను తెలంగాణ సమాజం తీవ్రంగా ఆక్షేపించింది.
తాజాగా బడ్జెట్‌కు సంబంధించి గవర్నర్ ప్రసంగంలోనూ కృష్ణా, గోదావరి జలవివాదాలను సంబంధిత ఫోరంలలో చర్చించి పరిష్కరించుకుంటామని ప్రభుత్వం పొందుపరచడం ఇంజినీర్లకు మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తున్నది. ఫోరంలో చర్చలే వద్దంటుంటే.. ఏకంగా ఆ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో చేర్చడమేమిటని మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం సైతం ఇదే విధంగా బడ్జెట్ ప్రసంగంలో పొందుపరిచడం గమనార్హం. ఇదే అంశాన్ని ఇంజినీర్లు గుర్తుచేస్తున్నారు. ఏపీ తరహాలోనే పొందుపరచడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. లేని జల వివాదాలను ప్రభుత్వమే సృష్టిస్తున్నదని ఇంజినీర్లు గుర్రుమంటున్నారు.