కరీంనగర్ తెలంగాణచౌక్, ఏప్రిల్ 5 : ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జాక్ వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్లో శనివారం జిల్లా కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని, ఉద్యోగుల బకాయిలను చెల్లిస్తామని, కొత్త బస్సులను కొనుగోలు చేసి సంస్థను లాభాల బాటలోకి తీసుకొస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో చేర్చిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే నిర్వీర్యం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 7న సమ్మె నోటీసు ఇచ్చామని, లేబర్ కమిషన్ చర్చలకు పిలిచినా ప్రభుత్వం, యాజమాన్యం రావడం లేదని మండిపడ్డారు. ఆర్టీసీలో 3800 ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించినా ఇప్పటి వరకు పురోగతి లేదన్నారు. ఈవీ బస్సుల కొనగోలుకు కేంద్రం అందిస్తున్న సబ్సిడీని కార్పొరేట్ కంపెనీలకు చెల్లిస్తున్నదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఈ నెల 7న లేబర్ కమిషన్ కార్యాలయం ఎదుట నిర్వహించే భారీ సభలో సమ్మె తేదీని ప్రకటిస్తామని స్పష్టంచేశారు.