కొందరిలో ఏ చిన్న వార్త విన్నా.. గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఛాతీలో బిగుసుకుపోయినట్లు అనిపిస్తుంది. ఈ సమస్య.. దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తుంది. ముఖ్యంగా పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశల్లో ఉన్న మహిళల్లో.. దీర్ఘకాలిక ఒత్తిడి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతున్నదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక ఒత్తిడి, హార్మోన్లు, గుండె ఆరోగ్యం.. మహిళల జీవితాలతో లోతుగా ముడిపడి ఉంటాయనీ, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీర్ఘకాలికంగా ఒత్తిడికి గురికావడం వల్ల శరీరంలో కార్టిసాల్ హార్మోన్ స్థాయులు పెరుగుతాయి. ఈ ఒత్తిడి హార్మోన్ ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ ఉత్పత్తికి అంతరాయం కలిగిస్తుంది. అధిక కార్టిసాల్.. రక్త నాళాలను బిగుతుగా చేస్తుంది. రక్తంలో చక్కెరను పెంచుతుంది. అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడాన్ని ప్రోత్సహిస్తుంది. ఇక ఒత్తిడి, అధిక రక్తపోటు.. గుండె లయను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ దశలో హార్మోన్ల మార్పులు.. మహిళలను ఈ ప్రమాదానికి ఎక్కువగా గురి చేస్తాయి. అడ్రినలిన్, కార్టిసాల్ వంటి హార్మోన్లతో నిండిన మహిళల శరీరం.. నిరంతర రక్తపోటు, గుండె దడను పెంచుతుంది. దీర్ఘకాలంలో గుండెపోటుకు దారితీస్తుంది. కాబట్టి, ప్రమాదం తీవ్రం కాకముందే స్పందించాలి. గుండెపోటు సంకేతాలను గుర్తించాలి. అయితే, మహిళల్లో వచ్చే గుండెపోటు లక్షణాలు వేరుగా ఉంటాయి.
పురుషుల్లో ఎక్కువగా కనిపించే ‘క్లాసిక్’ ఛాతీ నొప్పి.. వీరిలో కనిపించకపోవచ్చు. బదులుగా.. శ్వాస ఆడకపోవడం, తీవ్రమైన అలసట, వికారం, తల తిరగడం, దవడతోపాటు మెడ, వీపు పైభాగంలో అసౌకర్యంగా అనిపించడం, అజీర్ణం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలను కొందరు గ్యాస్ట్రిక్ సమస్యలు, తల తిరగడం లాంటి మామూలు సమస్యలుగానే భావిస్తారు. అయితే, ఈ సమస్యలు నిరంతరంగా, అసాధారణంగా అనిపిస్తే గుండె ప్రమాదంలో ఉన్నట్టే! ఇక ఈ సమస్యలకు నిద్ర లేమి, అధిక బరువు కూడా తోడైతే.. తీవ్రత మరింత పెరుగుతుంది. కాబట్టి.. ఇలాంటి సమస్యలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశలో ఉన్న మహిళలు ముందస్తు స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. జీవనశైలిలో మార్పులతో సమస్యను చాలావరకూ తగ్గించుకోవచ్చు.