Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్ల పాలిట ఈ సోమవారం బ్లాక్ మండేగా మారింది. డొమెస్టిక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీగా నష్టపోయాయి. పశ్చిమాసియాలో అమెరికా,ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండటం సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. చమురు ధరలు భారీగా పెరగడం, విదేశీ సంస్థాగత మదుపర్ల విక్రయాలు కొనసాగుతుండటం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. సెన్సెక్స్ ఒక దశలో 2 వేల పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ 22,500 పాయింట్ల మార్కుకు కాస్త ఎగువన ముగిసింది.
ఫలితంగా ఒక్కరోజులోనే మదుపర్ల సంపద దాదాపు రూ.14 లక్షల కోట్లు ఆవిరైపోయి రూ.415 లక్షల కోట్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ తొలిసారి 94 మార్కు దాటి 94.01 వద్ద ఆల్‌టైమ్ కనిష్ఠానికి చేరింది. సెన్సెక్స్ ఉదయం 73,732.58 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 74,532.96) భారీ నష్టాల్లో ప్రారంభమైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఇంట్రాడేలో 72,558.44 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 1836.57 పాయింట్ల నష్టంతో 72,696.39 వద్ద ముగిసింది.
ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 601.85 పాయింట్ల నష్టంతో 22,512.65 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా స్టాక్స్ మినహా మిగిలిన స్టాక్స్ నష్టాలు చవిచూశాయి. టైటాన్, ట్రెంట్, అల్ట్రాటెక్ సిమెంట్, బీఈఎల్, ఇండిగో స్టాక్స్ ప్రధానంగా నష్టపోయాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 113.20 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం 4,272 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.