ముంబై, మే 8: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండోరోజూ నష్టాలకే పరిమితమయ్యాయి. పశ్చిమాసియాలో భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల నడుమ బీఎస్ఈ ప్రధాన సూచీ సెన్సెక్స్ 516.33 పాయింట్లు లేదా 0.66 శాతం పడిపోయి 77,328.19 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ కూడా 150.50 పాయింట్లు లేదా 0.62 శాతం కోల్పోయి 24,176.15 వద్ద నిలిచింది. ముడి చమురు సరఫరాపై నెలకొన్న ఆందోళనలతోనే మదుపర్లు అమ్మకాల ఒత్తిడికి లోనైనట్టు విశ్లేషకులు చెప్తున్నారు.
బీవోఐ ఆకర్షణీయం
న్యూఢిల్లీ, మే 8: బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికిగాను రూ.3,016 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.2.626 కోట్ల లాభంతో పోలిస్తే 15 శాతం వృద్ధి కనబరిచింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.21,751 కోట్ల నుంచి రూ.22,685 కోట్లకు పెరిగినట్టు వెల్లడించింది. బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 3.27 శాతం నుంచి 1.98 శాతానికి దిగిరాగా, నికర ఎన్పీఏ కూడా 0.82 శాతం నుంచి 0.56 శాతానికి దిగొచ్చింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.79,820 కోట్ల ఆదాయంపై రూ.10,527 కోట్ల నికర లాభాన్ని గడించింది. మరోవైపు, రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు రూ.4.65 డివిడెండ్‌ను బ్యాంక్ ప్రతిపాదించింది.