Stock Market : భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీ లాభాల్లో ముగిశాయి. వరుసగా రెండోరోజు మార్కెట్ లాభాల్లో ముగియడం విశేషం. సెన్సెక్స్ 579 పాయింట్లు, నిఫ్టీ 169 పాయింట్లు లాభపడ్డాయి. ఉదయం 9.15 గంటలకు ట్రేడింగ్ లాభాల్లో ప్రారంభమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 200 పాయింట్లకుపైగా లాభంతో 77,100 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 70 పాయింట్ల లాభంతో 24,100 వద్ద ప్రారంభమైంది. చివరకు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 579 పాయింట్లు లాభంతో 77,502 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో 24,175 వద్ద ముగిసింది.
పశ్చిమాసియా యుద్ధం నివారణ, అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, చమురు ధరలు తగ్గడం, ఇరాన్, అమెరికా శాంతి చర్చలు వంటివి మార్కెట్‌కు కలిసొచ్చాయి. అదే విధంగా ఐటీషేర్లలో కొనుగోళ్లకు మద్దతు లభించడంతో మార్కెట్ మరింత లాభపడింది. సెన్సెక్స్ 30 సూచీలో టీసీఎస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతి, ఎల్‌అండ్‌టి, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, కోటక్ బ్యాంక్, బీఈఎల్ షేర్లు నష్టపోయాయి. అయితే, ఇతర ఆసియా మార్కెట్లు నష్టాల్లోనే ముగిశాయి. దక్షిణ కొరియా కోస్పి ఐదు శాతం నష్టపోయింది. జపాన్ నిక్కీ కూడా నష్టాలతోనే ముగిసింది. అమెరికా మార్కెట్లు కూడా నష్టాల బాటలోనే సాగాయి.
అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర భారీగా తగ్గింది. బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 71 డాలర్లుగా ఉంది. అలాగే, డబ్ల్యూటీఐ బ్యారెల్ క్రూడాయిల్ ధర 68 డాలర్లుగా ఉంది. గత మార్చి తర్వాత ఈ స్థాయిలో ధరలు తగ్గడం ఇదే మొదటిసారి. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఔన్స్ బంగారం ధర 4,063 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. డాలర్‌తో రూపాయి విలువ 95.40 వద్ద కొనసాగుతోంది.