Heart Health | నేటి జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గిపోవడం, ఒత్తిడి పెరగడం, నిద్రలేమి వంటి కారణాల వల్ల గుండె సంబంధిత వ్యాధులు అన్ని వయసుల వారిలో పెరుగుతున్నాయి. చాలా మంది ఛాతినొప్పి, అధిక రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పెరిగిన తర్వాతే గుండె ఆరోగ్యం గురించి ఆలోచిస్తారు. అయితే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే సమస్యలు వచ్చిన తర్వాత కాదు, ప్రతిరోజూ కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను పాటించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. గుండె ఆరోగ్యానికి కండరాల బలం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో కండరాల మోతాదు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ నిరోధకత తగ్గడం, రక్తపోటు నియంత్రణలో ఉండటం, రక్తనాళాలు గట్టిపడే ప్రమాదం తగ్గడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. కండరాలు కేవలం శరీర బలానికే కాకుండా గుండెను రక్షించే అవయవంలా కూడా పనిచేస్తాయి.
వ్యాయామ సమయంలో శరీరం ఉపయోగించగలిగే గరిష్ట ఆక్సిజన్ పరిమాణాన్ని వీఓ2 మ్యాక్స్ (VO₂ Max)గా పిలుస్తారు. ఈ స్థాయి ఎంత ఎక్కువగా ఉంటే గుండె, ఊపిరితిత్తుల పనితీరు అంత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వీఓ2 మ్యాక్స్ మెరుగ్గా ఉండటం వల్ల శారీరక సామర్థ్యం పెరగడం, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటం, ఎక్కువకాలం ఆరోగ్యవంతమైన జీవితం గడిపే అవకాశం పెరుగుతుంది. వేగంగా నడవడం, సైక్లింగ్ చేయడం, రన్నింగ్ లేదా మోస్తరు తీవ్రతతో కార్డియో వ్యాయామాలు చేయడం ద్వారా దీనిని మెరుగుపరచవచ్చు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. శరీరంలో వాపు (ఇన్ఫ్లమేషన్) గాయాలు, ఇన్ఫెక్షన్లు లేదా ఇతర హానికర పరిస్థితులకు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ స్పందించే సహజ ప్రక్రియ. అయితే ఎలాంటి ప్రమాదం లేకపోయినా ఈ స్పందన ఎక్కువకాలం కొనసాగితే దానిని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. ఇది గుండెకు నిశ్శబ్ద శత్రువులా పనిచేస్తుంది. హెచ్ఎస్-సీఆర్పీ (hs-CRP), హోమోసిస్టీన్, ఇన్సులిన్ వంటి పరీక్షల ద్వారా దీని స్థాయిని అంచనా వేయవచ్చు. ఇవి నియంత్రణలో ఉంటే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.
తగినంత నిద్ర గుండె ఆరోగ్యానికి అత్యంత అవసరం. సరైన నిద్ర లేకపోతే కార్టిసోల్ అనే ఒత్తిడి హార్మోన్ పెరగడం, రక్తపోటు అధికమవడం, ఇన్సులిన్ పనితీరు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయి. ప్రతిరోజూ ఏడు నుంచి తొమ్మిది గంటల పాటు నిద్రపోవాలని, చీకటి, చల్లని గదిలో మొబైల్ ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు దూరంగా నిద్రించడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అధిక మానసిక ఒత్తిడి కూడా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రధాన కారణాల్లో ఒకటి. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల కార్టిసోల్ స్థాయిలు పెరిగి శరీరంలో వాపు, రక్తనాళాలపై ఒత్తిడి పెరుగుతుంది. శ్వాస వ్యాయామాలు చేయడం, నడక అలవాటు చేసుకోవడం, ప్రకృతి మధ్య సమయం గడపడం వంటి చర్యలు నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయి.
గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు సప్లిమెంట్లు లేదా ఇతర ఆధునిక పద్ధతులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రతిరోజూ ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, తగిన నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి ప్రాథమిక అలవాట్లను పాటించడం అత్యంత ప్రభావవంతమైన మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. సంపూర్ణత అవసరం లేదు కానీ ప్రతి రోజు ఈ ప్రాథమిక అలవాట్లను క్రమశిక్షణతో పాటించడం గుండెను దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు.