పెన్పహాడ్, జులై 02 : హరితహారం పథకం అధికారుల అవగాహన లోపంతో నీరు గారిపోతుంది. పచ్చదనం పెంపునకు ప్రతీ యేటా కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నా అధికారుల నిర్లక్ష్యంతో నాటిన మొక్కలు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండల పరిధిలోని అనంతారం అడ్డ రోడ్డుకు వెళ్లే రహదారికి ఇరువైపులా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో నాటిన చెట్లను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం నరికేస్తున్నారు. అనంతారం శివారులో కొత్తగా ఏర్పాటు అవుతున్న రైస్ మిల్లు కోసం కొత్త లైన్ విద్యుత్ తీగలకు అడ్డువస్తున్నాయంటూ రోడ్డు పొడవునా ఉన్న వందల కొద్ది చెట్లను తొలగిస్తున్నారు. స్థానికంగా వేస్తున్న రైస్ మిల్లు కోసం చెట్లను నరికేశారు. వాస్తవానికి హరితహారం మొక్కలను తప్పిస్తూ విద్యుత్ లైన్ను తీసుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ ఇవేవీ పట్టించుకోకుండా పెద్ద ఎత్తున పెరిగిన చెట్లను నరికేశారు. దాంతో చెట్లను నరికిన వారిపై వాల్టా చట్టం కింద చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు.

విచ్చలవిడిగా హరితహారం చెట్లు నరికివేత