Stock Market : అంతర్జాతీయంగా ఉన్న సానుకూల సంకేతాలవల్ల భారత స్టాక్ మార్కెట్లు (Stock Markets) వరుసగా మూడో రోజూ లాభాల్లో ముగిశాయి. అమెరికా (USA), ఇరాన్ (Iran) మధ్య జరగనున్న చర్చల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించవచ్చనే ఆశలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా మంగళవారం ట్రేడింగ్‌లో సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 753.03 పాయింట్లు లాభపడి 79,273.33 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 211.75 పాయింట్లు లాభపడి 24,576.60 వద్ద ముగిసింది. నెస్లే ఇండియా, ట్రెంట్, హిందుస్థాన్ యూనిలీవర్ వంటి హెవీవెయిట్ షేర్లలో కొనుగోళ్లు సూచీల పెరుగుదలకు దోహదపడ్డాయి. బ్రాడర్ మార్కెట్లలోనూ సానుకూల వాతావరణం కనిపించింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ 0.49 శాతం, స్మాల్‌క్యాప్ 0.88 శాతం మేర లాభపడ్డాయి. రంగాల వారీగా చూస్తే నిఫ్టీ ఎఫ్ఎంసీజీ, రియల్టీ సూచీలు మంచి పనితీరు కనబరచగా నిఫ్టీ ఫార్మా వెనుకబడింది.
సాంకేతికంగా నిఫ్టీకి 24,600 స్థాయి వద్ద తక్షణ నిరోధం ఎదురవుతోందని, దానిని దాటితే 24,850, ఆపై 25,000 స్థాయిలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కింది స్థాయిలో 24,350–24,400 శ్రేణి తక్షణ మద్దతుగా పనిచేస్తుందని తెలిపారు.