Jeevan Reddy | కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతుబంధును సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు. మహిళలకు రూ.2500 ఇస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని అన్నారు. అన్ని వర్గాల వారిని మోసం చేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని అన్నారు.
జగిత్యాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను నాశనం చేసింది రేవంత్ ప్రభుత్వమే అని అన్నారు. విద్యా శాఖపై సీఎం రేవంత్ ఒక్క రివ్యూ కూడా చేయలేదని తెలిపారు. సీఎం హోదాలో ఉండి రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. కేసీఆర్ సభ సక్సెస్ జీర్ణించుకోలేక రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.
నిన్నటి బీఆర్ఎస్ సభ తెలంగాణ ఉద్యమాన్ని తలపించిందని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ పుణ్యం వల్లే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారని వ్యాఖ్యానించారు. అలాంటి ఆయన్ను పట్టుకుని ఉరితీస్తాను అంటావా అని మండిపడ్డారు. ప్రజాపాలన నెపంతో కాంగ్రెస్ ప్రజలను వంచిస్తుందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తెలిపారు. రైతుబంధును ఎగ్గొట్టారని.. గురుకులాలను నిర్వీర్యం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి ఆంధ్రా నాయకులకు తొత్తుగా, ఆంధ్రా నాయకుల చేతిలో కీలుబొమ్మలా మారాడని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని అన్నారు. 2015లో ఇదే టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డిని ఎమ్మెల్సీ చేయాలని చూసి, ఓటుకు నోటులో దొరికాడని గుర్తుచేశారు.
నాదెండ్ల భాస్కరరావు అంశం గురించి రేవంత్ రెడ్డి సోయి లేకుండా మాట్లాడుతున్నాడని జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆనాడు నాదెండ్ల భాస్కరరావుకు కాంగ్రెస్ మద్దతుగా నిలిచిందని తెలిపారు. ఎన్టీఆర్ హయాంలో నాదెండ్ల భాస్కరరావును మంత్రి పదవి నుంచి తొలగించినప్పుడు, ఆయనకు మద్దతుగా తాను మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తుచేశారు. తనను ఎవరూ మంత్రి పదవి నుంచి తొలగించలేదని.. తానే రాజీనామా చేశానని స్పష్టం చేశారు. తాను మాత్రమే కాదని.. ఆ రోజు ఇందిరా గాంధీ, కాంగ్రెస్ పార్టీ మొత్తం నాదెండ్ల భాస్కరరావుకు మద్దతుగా నిలిచిందని తెలిపారు. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియదని అనుకుంటా అని విమర్శించారు.