IPL 2026 : పంతొమ్మిదో సీజన్లో తేలిపోతున్న మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings )కు కీలక బ్యాటర్ సేవల్ని కోల్పోయింది. పవర్ ప్లేలో చెలరేగుతూ చెన్నైకి బ్యాటింగ్ అస్త్రంగా మారిన ఆయుశ్ మాత్రే (Ayush Mhatre) విషయంలో అనుకున్నదే జరిగింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో గాయపడిన మాత్రే టోర్నీకి దూరమయ్యాడు. వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో 18 ఏళ్ల మాత్రే తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని మంగళవారం సీఎస్కే ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐపీఎల్ మేటి జట్లలో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్‌కు ఆటగాళ్ల గాయాలు వరస షాక్‌లిస్తున్నాయి. టోర్నీ ఆరంభం నుంచి ఎంఎస్ ధోనీ అందుబాటులో లేడు.. ఈమధ్యే సీనియర్ పేసర్ ఖలీల్ అహ్మద్ గాయంతో నిష్క్రమించగా.. ఇప్పుడేమో కుర్ర బ్యాటర్ ఆయుశ్ మాత్రే సైతం ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఎడమ కాలి కండరాల గాయంతో బాధ పడుతున్న అతడు కోలుకునేందుకు 6-12 వారాలు పట్టనుంది. దాంతో, వైద్యులు విశ్రాంతి సూచించినందున మాత్రే సేవల్ని చెన్నై కోల్పోనుంది. అండర్-19 వరల్డ్‌కప్ హీరోగా పంతొమ్మిదో సీజన్లో అడుగుపెట్టిన మాత్రే.. 6 మ్యాచుల్లో 177.87 స్ట్రయిక్ రేటుతో 201 పరుగులు సాధించాడు.
Official Announcement
Ayush Mhatre has been ruled out of the remainder of IPL 2026 due to a left hamstring injury sustained while batting during the match against Sunrisers Hyderabad on April 18.
Ayush’s injury will require a rehabilitation period of 6-12 weeks.
We wish Ayush… pic.twitter.com/7bGrFvqjY9
— Chennai Super Kings (@ChennaiIPL) April 21, 2026
ఏప్రిల్ 18న ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ నిర్దేశించిన 195 పరుగుల ఛేదనలో క్రీజులోకి వస్తూనే బౌండరీలతో చెలరేగిన మాత్రే.. ప్రఫుల్ హింగే ఓవర్లో ఐదు ఫోర్లతో చెలరేగాడు. అయితే.. రెండో పరుగు తీసే క్రమంలో అనూహ్యంగా ఎడమ కాలి కండరాలు పట్టేయడంతో మాత్రే ఇబ్బంది పడ్డాడు. ఓవర్లో క్లాసెన్ డైవింగ్ క్యాచ్‌తో ఔటైన మాత్రే.. నడవడానికి కష్టపడడంతో సహాయక సిబ్బంది చేయందించారు. మ్యాచ్ అనంతరం మాత్రే గాయంపై బ్యాటింగ్ కోచ్ స్పందించిన మైక్ హస్సీ.. ఐపీఎల్‌కు దూరమయ్యేలా ఉన్నాడని, కొత్త బ్యాటర్‌ను తీసుకుంటామని తెలిపాడు.

‘కండరాల చీలిక వచ్చి ఉండవచ్చు.. ఆ గాయం తీవ్రత ఎంతలా ఉందనేది తెలియదు. ఒకట్రెండు రోజుల్లో మాత్రేకు స్కానింగ్ పరీక్ష చేయిస్తాం. ఒకవేళ గాయం తీవ్రత పెద్దదైతే అతడు టోర్నీకి దూరమవ్వడం ఖాయం. మాత్రే అందుబాటులో లేకపోవడం నిజంగా మాకు చెడు వార్త. అతడు చాలా మంచిగా ఆడుతున్నాడు. ఇప్పుడు అతడు గాయపడినందున మరొకరికి అవకాశం ఇవ్వక తప్పదు. మూడో స్థానంలో ఆడేందుకు కొందరు ఆటగాళ్లు ఉన్నారు. అయితే.. ఎవరికి చోటు దక్కుతుంది అనేది ఆసక్తిగా ఉంది’ అని హుస్సే వెల్లడించాడు. మాత్రే గాయపడడంతో అతడి స్థానంలో ఉర్విల్ పటేల్ మూడో స్థానంలో ఆడే అవకాశముంది. పంతొమ్మిదో సీజన్లో రెండే విజయాలతో ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన చెన్నై ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టనుంది.