Tamanna Simhadri : బిగ్ బాస్ షో ప్రేక్షకులకు సుపరిచితురాలైన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి తాజాగా సోషల్ మీడియాలో ఓ సంచలన వార్తతో అందరినీ ఆశ్చర్యపరిచారు. గత కొంతకాలంగా వార్తల్లో లేని తమన్నా సింహాద్రి.. ఇటీవలే తనకు వివాహమై ఏడాది పూర్తయిందంటూ భర్త ఫోటోను రివీల్ చేశారు. ఇప్పుడు అంతకుమించి అనేలా తాను గర్భవతిని అంటూ బేబీ బంప్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశారు. అది ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. తమన్నా సింహాద్రి నేపథ్యం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.
విజయవాడకు చెందిన తమన్నా అబ్బాయిగా పుట్టినప్పుడు ఆమె పేరు మస్తాన్. తల్లిదండ్రుల మొక్కుల వల్ల మస్తాన్ జన్మించాడు. అయితే ఆ అబ్బాయిలో అమ్మాయి లక్షణాలు ఉన్నాయి. దాంతో పెరిగి పెద్దయిన తర్వాత ముంబై వెళ్లి లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకుని తమన్నా సింహాద్రిగా మారాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 3లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టి, తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్నారు తమన్నా. ముఖ్యంగా యాంకర్ శ్రీముఖితో ఆమెకు ఉన్న స్నేహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
రాజకీయాల్లో కూడా తమన్నా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మాజీ మంత్రి సింహాద్రి సత్యనారాయణ వారసురాలిగా రాజకీయ ఆసక్తితో 2019లో మంగళగిరిలో నారా లోకేశ్‌పై, 2024లో పిఠాపురంలో పవన్ కల్యాణ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే రాజకీయాల కంటే ఆమె వ్యక్తిగత జీవితమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ట్రాన్స్‌జెండర్ అయిన తమన్నా గర్భం దాల్చడం సాధ్యమేనా..? అనే సందేహాలు నెటిజన్లలో వ్యక్తమవుతున్నాయి.
అయితే తాను ఓ ప్రత్యేకమైన చికిత్స చేయించుకున్నానని, అది విజయవంతం కావడంతోనే ఇప్పుడు గర్భవతిని అయ్యానని తమన్నా చెబుతున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతుండగా.. మరికొందరు ఇది కేవలం ఫోటోషూట్ లేదా ప్రాంక్ కావచ్చని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా నిన్న పెళ్లి వార్త.. నేడు ప్రెగ్నెన్సీ వార్తతో తమన్నా సింహాద్రి మరోసారి తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారారు.