ముంబై, నవంబర్ 17: వరుసగా రెండోరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా రంగానికి సంబంధించిన సూచీలు తీవ్ర ఒత్తిడికి గురి కావడంతో మదుపరులు అమ్మకాలకు పోటెత్తారు. ఫలితంగా 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 314.04 పాయింట్లు తగ్గి 60 వేలకు పరిమితమైంది. ఇంట్రాడేలో 60,426 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్న సూచీ ఒక దశలో 59,944 పాయింట్ల స్థాయికి పడిపోయింది. జాతీయ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 100.55 పాయింట్లు పతనం చెంది 17,898. 65 వద్ద ముగిసింది. రెండు శాతానికి పైగా మార్కెట్ వాటాను కోల్పోయిన యాక్సిస్ బ్యాంక్ టాప్ లూజర్‌గా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 1.91 శాతం, కొటక్ బ్యాంక్ 1.51 శాతం, భారతీ ఎయిర్టెల్ 1.39 శాతం, టైటాన్ 1.2 శాతం పతనం చెందా యి. వీటితోపాటు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీల షేర్లు మదుపరులను ఆకట్టుకోలేకపోయా యి. కానీ, కార్ల తయారీ దిగ్గజం మారుతి సుజుకీ 2.77 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. ఏషియన్ పెయింట్స్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, ఐటీసీ, ఇండస్ఇండ్, టెక్ మహీంద్రాలు మాత్రం లాభపడ్డాయి.