హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్‌ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎర్రోళ్ల మాట్లాడుతూ.. ఏపీలో ఆయుష్ హౌస్ సర్జన్లకు రూ.26వేలు, పీజీలకు రూ.65వేలపైన ైస్టెపెండ్ ఇస్తుంటే.. రాష్ట్రంలో పెంచేందుకు రేవంత్ సర్కార్‌కు చేతులు రావడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో అల్లోపతి హౌస్ సర్జన్లకు రూ.28వేల ైస్టెపెండ్ ఇస్తుంటే ఆయుష్ వాళ్లకు కేవలం రూ.13వేలు ఇస్తున్నారని వాపోయారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టగానే విద్యార్థులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల డిమాండ్లను నెరవేర్చి, అల్లోపతి డాక్టర్లతో సమానంగా ైస్టెపెండ్ పెంచుతూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే.. బీఆర్ఎస్ తరఫున విద్యార్థులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.