ఆ పాఠశాల 80 ఏళ్లక్రితం నాటిది. ఇక్కడ చదివినవారెందరో ఇతర నగరాలు, రాష్ర్టాలు, విదేశాల్లో స్థిరపడ్డారు. నేలపై పాఠాలు నేర్చుకొని జీవితాల్లో ఉన్నతస్థాయికి ఎదిగారు. తరగతి గదుల్లో లైట్లు ఫ్యాన్లు లేవు.. వర్షం వస్తే ఇంటి దారి పట్టేవారు. ఆడుకోవడానికి ఆట సామగ్రి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో పలువురు ఈ బడి బాగుకు ముందుకొచ్చారు. ఒక్కొక్కటిగా సౌకర్యాలు సమకూర్చుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల బలోపేతానికి సంకల్పించి ‘మన ఊరు- మన బడి’కి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కొత్తగూడెం కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఈ కార్యక్రమానికి ఎంపికైంది. ఈ నేపథ్యంలో పాఠశాల పూర్వ పరిస్థితి, అంచెలంచెలుగా ఎదిగిన తీరు, ప్రభుత్వ చేయూతతో ఒనగూరనున్న ప్రయోజనాలపై ‘నమస్తే తెలంగాణ’కథనం.
కొత్తగూడెం ఎడ్యుకేషన్, మార్చి 3 : ‘మేము చదువుకునే సమయంలో అరకొర వసతులున్నాయి. నేలపైనే కూర్చొని పాఠాలు వినే వాళ్లం. తాగునీరు సరిగ్గా ఉండేది కాదు. ఆడుకోవడానికి క్రీడా సామగ్రి లేదు. తరగతి గదుల్లో లైట్లు, ఫ్యాన్ల ఊసే లేదు. ప్రభుత్వ పాఠశాల కాబట్టి గోడలకు సున్నాలు, సరైన వసతులు లేవు. వర్షం వస్తే గోడలకు నాచు పట్టేది. ఇలాంటి పాఠశాలలను బాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ‘మన ఊరు మన బడి’ ద్వారా నిధులు కేటాయించి బడులను అభివృద్ధి చేస్తోంది. అందుకే మేం ఆలోచించాం. మా వంతుగా మేమూ సాయం చేయాలనుకున్నాం. మేం చదువుకున్న పాఠశాలలో ఇప్పుడు చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలూ కల్పించాలనుకున్నాం. సమకూర్చాం.’ అంటున్నారు ఆ పాఠశాల పూర్వ విద్యార్థులు. వారే.. కొత్తగూడెం కూలీలైన్ పాఠశాలలో 70 ఏళ్ల క్రితం చదివి ఇప్పుడు ఉన్నత స్థానాల్లో స్థిరపడిన ప్రముఖులు.
కొత్తగూడెంలోని కూలీలైన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను 80 ఏళ్ల క్రితం నిర్మించారు. 1950ల్లో ఆ పాఠశాలలో పదో తరగతి ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు కొత్తగూడెంలోని పుర ప్రముఖులుగాను, ఇతర నగరాల్లో, విదేశాల్లో వృత్తి నిపుణులుగాను స్థిరపడ్డారు. అయితే కాలక్రమంలో సౌకర్యాలు కరువై ప్రాభవం కోల్పోతున్న ఈ పాఠశాలను ఆ పూర్వ విద్యార్థులు గమనించారు. తాము ఉన్నత శిఖరాలు అధిరోహించేలా తీర్చిదిద్దిన పాఠశాల ఇప్పుడు శిథిలావస్థకు చేరడంతో దానిని బాగు చేయాలని నిర్ణయించుకున్నారు. వర్షపు ధారలతో తడుస్తున్న తరగతి గదులను, కూలిపోయిన ప్రహరీని, ఉపాధ్యాయుల కొరతను, విద్యార్థుల గొంతెండే పరిస్థితిని చక్కదిద్దాలనుకున్నారు. ఆరేళ్లుగా అడ్మిషన్ల తగ్గుదలను, కేవలం 70కే పరిమితమైన విద్యార్థుల సంఖ్యను, కేవలం తెలుగు మీడియంలోనే కొనసాగుతున్న విద్యాబోధన, సమీప ప్రాంత పాఠశాలలో దీనిని విలీనం చేయాల్సిన పరిస్థితులను గమనించి వీటిన్నింటికీ చక్కని పరిష్కారం చూపాలనుకున్నారు. సంకల్పాన్ని ఆచరణలో పెట్టి చూపించారు.
2018-19లో ఉపాధ్యాయులు, ఎస్ఎంసీ సభ్యులు, వార్డు కౌన్సిలర్లు, తల్లిదండ్రులు కలిసి విద్యాశాఖ అనుమతితో ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియంలో విద్యాబోధననూ అందుబాటులోకి తెచ్చుకున్నారు. 2016-17లో సుమారుగా 70 మందిగా ఉన్న విద్యార్థుల సంఖ్య.. 2017-18లో 77కు, 2018-19లో 90కి, 2019-20లో 102కు, 2020-21లో 130కి, ప్రస్తుతం 210కి చేరింది. కేవలం ఈ హైస్కూల్ ఉపాధ్యాయులతోపాటు 11 పాఠశాలల కాంప్లెక్స్ స్థాయిలో ఉపాధ్యాయులకూ సోర్స్ పర్సన్లు ఇక్కడే టీచింగ్ క్లాసులు నిర్వహిస్తుండడం విశేషం. అలాగే, వివిధ రకాల శిక్షణలకూ ఈ పాఠశాల నిలయమైంది. సుమారు 70 నుంచి 210కి విద్యార్థుల సంఖ్య పెరగడం వెనుక దాతలు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషి ఎంతో ఉంది.
ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యాబోధన అందిస్తున్నారు. స్కాలర్షిప్ టెస్టులకు శిక్షణ ఇస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహించి పదో తరగతిలో సత్ఫలితాలను సాధిస్తున్నారు. తల్లిదండ్రులకు అవగాహన సమావేశాలు నిర్వహించి విద్యార్థులంతా తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. పూర్వ విద్యార్థులు, దాతలు కలిసి వనరులు, వసతులు సమకూర్చుతున్నారు. కాంప్లెక్స్ స్థాయిలో విద్యా ర్థులకు యోగా, మెడిటేషన్, క్రీడలు, కరాటే, స్కౌట్స్ అండ్ గైడ్స్, కోలాటం వంటి వాటిల్లో శిక్షణ కూడా ఇస్తున్నారు. వివిధ రకాల వకృత్వ పోటీలు నిర్వహించి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు.