విద్యారంగంలో చారిత్రాత్మక మార్పులు తెస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ఆర్భాటంగా ప్రకటించింది. నాణ్యమైన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందిండమే లక్ష్యమని ఉపముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో గొప్పగా చెప్పారు. మాటల్లో కనిపించిన చిత్తుశుద్ధి కేటాయింపుల్లో మచ్చుకైనా కానరాలేదు. బడ్జెట్లో విద్యారంగానికి రూ.26,674 కోట్లు మాత్రమే కేటాయించారు. విద్యా కమిషన్ చేసిన సిఫారసలు తూతూమంత్రమేనని బడ్జెట్లో కేటాయింపులు చూస్తే స్పష్టమైపోతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం తన తొలి బడ్జెట్లో విద్యకు రూ.21,292 కేటాయించగా, ఇది మొత్తం బడ్జెట్లో 7.31 శాతం కాగా, రెండో బడ్జెట్లో రూ.23,108 కోట్లు, మొత్తం బడ్జెట్లో 7.57 శాతం కేటాయించింది. ప్రస్తుతం మూడో బడ్జెట్లో 8.22 శాతంతో గత ఏడాది కంటే కొద్ది పెంపు మాత్రమే ఉన్నది. ఈ లెక్కన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ అయిన 15% శాతం బడ్జెట్‌ను చేరుకోవడానికి ఎన్నేండ్లు కావాలో మరి? ఈ అరకొర నిధుల ద్వారా ‘రైజింగ్ తెలంగాణ’ పేరుతో విద్యకు ప్రాధాన్యత ఇస్తానంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం మాటలు నీటిమూటలయ్యాయి. ఈ అరకొర కేటాయింపులతో మొత్తం విద్యార్థుల్లో 35 శాతం మాత్రమే నమోదవుతున్న ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ఎంతమాత్రం సాధ్యం కాదు.
అంతర్జాతీయ స్థాయిలో విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తామంటూ బడ్జెట్లో ఉపన్యాసం ఇచ్చిన ప్రభుత్వం, ఉన్నత విద్యకు రూ.5,443 కోట్ల కేటాయింపులతో ఆచరణ సాధ్యం కాదు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆ నిధులు సరిపోవు. గుడ్డిలో మెల్లలా ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెయ్యి కోట్లు, చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి రూ.400 కోట్లు అదనంగా కేటాయించినప్పటికీ, ఆచరణలో ఖర్చు చేసేది ఎంతో..కాలమే సమాధానం చెప్పాలి. వెరసి బడ్జెట్ మాటలు కోటలు దాటాయి, కానీ చేతలు నిస్సహాయంగా మిగిలిపోయాయి.
యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలలకు 5 వేల కోట్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్‌కు రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ 20 వేల కోట్ల అంచనాతో అంటే కేవలం 25 శాతం నిధులతో పూర్తి స్థాయిలో యంగ్ ఇండియా పాఠశాలలు ఉపయోగంలోకి రావాలంటే ఎన్నేండ్ల్లు వేచిచూడాలో? విద్యా కమిషన్ ప్రతిపాదిత తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు రూ.500 కోట్ల కేటాయింపుతో 2 వేల తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉనికిలోకి రావడానికి ఎంతకాలం పడుతుందో తెలియదు? రూ.720 కోట్ల కేటాయింపులతో పూర్వ ప్రాథమిక తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు పాలు, రాగిజావలతో కూడిన బ్రేక్‌ఫాస్ట్ ప్రారంభించనున్నట్టు ప్రతిపాదించారు.
రానున్న విద్యా సంవత్సరంలో ఇప్పటికే ప్రారంభమైన 1,323 పూర్వ ప్రాథమిక పాఠశాలలకు తోడు మరో రెండు వేల నుంచి 2,500 పాఠశాలలను ప్రారంభించనున్నామని ఆర్థిక మంత్రి ప్రకటించారు. అయితే, శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు లేకుండా పూర్వ ప్రాథమిక విద్యా తరగతులు విజయవంతం కావు. అందుకు జిల్లా విద్యాశిక్షణ సంస్థల్లో శిక్షణ కూడా వెంటనే ప్రారంభించి, ఉపాధ్యాయులకు శిక్షణ అందిస్తే తప్ప నాణ్యమైన పూర్వ ప్రాథమిక విద్య అందించలేం. పైపై మెరుగులతో కేటాయింపులు ఉన్నప్పటికీ మౌలికంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, 664 గురుకులాలకు శాశ్వత భవనాల నిర్మాణం, విశ్వవిద్యాలయాలకు మౌలిక వసతులు కల్పించడాన్ని పట్టించుకోకుండా మొత్తం విద్యా వ్యవస్థను బాగుచేయలేం. కాంగ్రెస్ వాగ్దానం చేసిన 15 శాతం నిధులను లేదా విద్యా కమిషన్ సూచించిన విధంగా 18 శాతం నిధులను ఆర్థిక మంత్రి ఏమాత్రం పట్టించుకోలేదు.
గత ఎన్నికల ప్రణాళికలో మూతబడిన 6 వేల పాఠశాలలను వెంటనే ప్రారంభిస్తామన్న వాగ్దానం చేశారు. కానీ ఇప్పటిదాకా 1,441 పాఠశాలలు మూతపడగా, మరో 640 బడులు మూసివేతకు సిద్ధంగా ఉన్నాయి. ఈ పాఠశాలలను ప్రారంభించి, విద్యార్థులకు అందుబాటులో ఉంచాలనే విషయం బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించలేదు. 70% జీరో నమోదు ఉన్న పాఠశాలల్లో తెలంగాణ రాష్ట్రం ముందున్న విషయాన్ని కూడా ఆర్థిక మంత్రి పట్టించుకోలేదు. పాఠశాలల పర్యవేక్షణ, నిర్వహణ కోసం 25 జిల్లాలకు డీఈవో పోస్టుల మంజూరును ప్రభుత్వం మరిచిపోయింది. జిల్లా ఉపవిద్యాధికారి, మండల విద్యాధికారి పోస్టుల భర్తీ విషయంలో ప్రభుత్వ కార్యాచరణ ఏమిటో తెలియదు. ఉపాధ్యాయ శిక్షణ కళాశాల, ఎస్సీఈఆర్టీలోని అధ్యాపకుల పోస్టుల భర్తీపై ప్రభుత్వ ప్రణాళిక వెల్లడించలేదు.
పెరుగుతున్న అంతరాలు, అసమానతలను పరిష్కరించకపోతే 10.7 శాతం వృద్ధిరేటుకు అర్థం ఉండదు. విద్య అనేది కేవలం సుస్థిర వృద్ధికి వెన్నెముకగా నిలిచే రంగం మాత్రమే కాదని, పేదరికాన్ని పారదోలే, నూతన ఆవిష్కరణల ఇంజిన్ అని మేధావులు, ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. విద్యా రంగం ఇప్పటికీ క్షేత్రస్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నది. నాణ్యత, సమానత్వం వంటి విషయాల్లో ఈ సవాళ్లు ఉన్నాయి. మన విధాన ప్రాధాన్యతల్లో విద్యకు సముచిత స్థానం కల్పించాలని మేధావులు చెప్తున్నారు. విద్యారంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలను పరిష్కరించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటేనే 2047 నాటికి ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం జరుగుతుంది.
బడాపారిశ్రామికవేత్తలు, కార్పొరేటు శక్తులు విద్యను వ్యాపారంగా మార్చాయి. ప్రభుత్వ పాఠశాలలపై తగిన దృష్టి సారించకపోవటంతో విద్యారంగంలో ప్రైవేటు శక్తుల ఆధిపత్యం పెరుగుతున్నది. దీంతో పేద, మధ్యతరగతి, అణగారిన వర్గాల పిల్లలు చదువుకు నోచుకోలేకపోతున్నారు. ఈ పరిస్థితులు మార్చడానికి కృషి జరగాలి.