న్యూఢిల్లీ, మార్చి 21: హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తున్నామంటూ ఢిల్లీ పోలీసులు శుక్రవారం యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా(యూఎన్ఐ) వార్తాసంస్థ కార్యాలయానికి సీల్ వేశారు. కాగా ఆ వార్తా సంస్థ ఈ చర్యను అనూహ్య దురాగతంగా, మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది. పోలీసులు తమ ఉద్యోగినులపై దురుసుగా ప్రవర్తించినట్లు యూఎన్ఐ ఆరోపించింది. అయితే చట్టపరమైన ప్రక్రియనే అనుసరించామని, ప్రతీది వీడియో తీసినందున ఎలాంటి తప్పిదాలు జరగలేదని డీఎస్పీ(న్యూఢిల్లీ) సచిన్ శర్మ విలేకరులకు తెలిపారు. తమ భూ కేటాయింపును రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ యూఎన్ఐ దాఖలు చేసిన పిటిషన్‌ని ఢిల్లీ హైకోర్టు కొట్టివేసిన తర్వాత ఆ ప్రాంగణానికి సీల్ వేసే ప్రక్రియను నిర్వహించడానికి పోలీసులు పెద్ద సంఖ్యలో శుక్రవారం రాత్రి యూఎన్ఐ కార్యాలయానికి చేరుకున్నారు. కేంద్ర గృహ, పట్టణ శాఖ పరిధిలోని తమ ప్రాంగణాన్ని ఖాళీ చేయాలని ల్యాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్(ఎల్ అండ్ వో) గతంలో యూఎన్ఐకి ఆదేశాలు జారీ చేసింది. వార్తాసంస్థకు చేసిన భూ కేటాయింపును రద్దు చేసిన దరిమిలా ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
దీన్ని సవాల్ చేస్తూ యూఎన్ఐ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా వార్తాసంస్థ అభ్యర్థనను తిరస్కరించిన హైకోర్టు భూ కేటాయింపు రద్దును సమర్థిస్తూ తీర్పు వెలువరించింది. కాగా, తమ ప్రాంగణానికి సీల్ వేసేందుకు వచ్చిన పోలీసుల ప్రవర్తనను యూఎన్ఐ ప్రస్తుత యాజమాన్యం ది స్టేట్స్‌మన్ ఖండించింది. దాన్ని అసాధారణ దురుసు ప్రవర్తనగా, భారత్‌లో మీడియా స్వేచ్ఛపై దాడిగా అభివర్ణించింది. భారత్‌లో మీడియా స్వేచ్ఛపై జరిగిన అనూహ్య దురాగతం, దాడి ఇది. దేశంలోని అత్యంత పురాతన వార్తాసంస్థ యూఎన్ఐకి చెందిన ఆఫీస్‌పై ఒక ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కూడా సిగ్గుపడేలా పోలీసు బలగాలు అక్షరాలా దాడి చేశాయి అని స్టేట్స్‌మాన్ ఎక్స్ పోస్టులో ఆరోపించింది. సంస్థ ఉద్యోగులు తమ వస్తువులను తీసుకునేందుకు కూడా సమయం ఇవ్వలేదని పేర్కొంది.
యాజమాన్యాన్ని బయటే నిలబెట్టి ఉద్యోగులపై లోపల దౌర్జన్యం చేశారని సంస్థ తెలిపింది. ఈ చర్య పత్రికా స్వేచ్ఛపై తీవ్ర ఆందోళన కలగచేస్తోందని మరో ఎక్స్ పోస్టులో యూఎన్ఐ తెలిపింది. ఎక్స్‌లో షేర్ అయిన ఓ వీడియోలో వాగ్వాదం సందర్భంగా ఒక మహిళా పోలీసు మహిళా జర్నలిస్టు పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న దృశ్యం కనిపించింది. అదుపు తప్పిన ఆ మహిళా జర్నలిస్టు కింద పడిపోగా వెనుక నుంచి ఒక వ్యక్తి గట్టిగా అభ్యంతరం తెలియచేస్తూ ఇదేం పని మేడమ్. చేతులు, కాళ్లు విరిగిపోగలవు. అయినా ఇదేం పద్ధతి అని ఆ మహిళా పోలీసును ప్రశ్నించడం వినిపించింది. కొందరు పోలీసులు విధుల్లో ఉండి మద్యం సేవించినట్లు తెలుస్తున్నది. ఇద్దరు న్యాయవాదులు, ఢిల్లీ పోలీసులు మా సిబ్బందిపై దుర్భాషలాడారు అని యూఎన్ఐ తెలిపింది.
‘పోలీసులు అనవసరంగా తొందర పడ్డారు’
యూఎన్ఐ ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకునే సందర్భంగా జరిగిన పోలీసుల దురుసు ప్రవర్తన, మితిమీరిన బల ప్రయోగాన్ని మూడు ప్రముఖ జర్నలిస్టు సంఘాలు ఖండించాయి. హైకోర్టు ఉత్తర్వు అమలు చేయడంలో పోలీసులు అనవసరమైన తొందరపాటుకు పాల్పడ్డారని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కోర్ వేర్వేరు ప్రకటనల్లో విమర్శించాయి. ఈ ప్రక్రియలో శుక్రవారం సాయంత్రం జర్నలిస్టులపై దురుసుగా ప్రవర్తించారని పేర్కొన్నాయి.