హైదరాబాద్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కోటాకు మించి కేటాయిస్తున్నామని కాంగ్రెస్ సర్కార్ ప్రగల్భాలు పలుకడమే తప్ప సగం కూడా ఖర్చు చేయడం లేదు. శాసనసభకు ప్రభుత్వం సమర్పించిన గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తుండగా దళిత, గిరిజనుల మీద ప్రభుత్వ వి వక్షకు ఇది నిదర్శనంగా నిలుస్తున్నది. 2024-25 బడ్జెట్లో ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్సీఎస్డీఎఫ్) కింద ప్రభుత్వం రూ.33,124.04కోట్లు, ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్‌కు రూ.17,056 కోట్లు కేటాయించింది. కానీ నిధుల్లో కేవలం 14,148 కోట్లు(42.71%) మాత్రమే వెచ్చించింది. ఇక ఎస్టీ ఎస్డీఎఫ్ నిధుల్లో 9,773కోట్లు (57.30%) మాత్రమే వెచ్చింది. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద కేటాయించిన నిధుల్లో సగానికి పైగా మిగిలిపోయాయి. ఇక 2025-26 బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద 40,232 కోట్లు కేటాయించగా, అందులో గరిష్ఠంగా రూ.11వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. తాజా బడ్జెట్లో ఎస్సీ సబ్‌ప్లాన్ నిధుల్లో ఏకం గా కోత విధించింది. 2026-27లో కేవలం 37,741 కోట్లను ప్రతిపాదించింది. నిరుడు బడ్జెట్లో కేటాయించిన నిధులతో పోల్చితే రూ.2,491కోట్లను తగ్గించింది. ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ.18,415కోట్లను ప్రతిపాదించింది. నిరుడు కన్నా స్వల్పంగా 1,246కోట్లను మాత్రమే పెంచింది. నిధులను భారీగా కేటాయిస్తున్నామని గొప్పగా ప్రకటిస్తున్నా ఖర్చు చేయడంలో సర్కార్ విఫలమవుతున్నది.
మొత్తం ప్రగతి పద్దు వ్యయంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులను కేటాయించడం పరిపాటి. నిధులను అన్ని ప్రభుత్వశాఖల ద్వారా ప్రత్యేకంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, అర్బన్ డెవలప్మెంట్, మహిళాశిశు సంక్షేమం, విద్యాశాఖ, ఆర్అండ్బీ తదితర కీలక శాఖలు కేటాయించిన నిధుల్లోనూ ఆయా వర్గాలకు ప్రత్యేకంగా పొందుపరుస్తుంది. సబ్‌ప్లాన్ అమలు కోసం నోడల్ ఏజెన్సీ కూడా ఉంటుంది. దళితవాడల, గిరిజన తండాలు, గూడేల్లో ప్రత్యేకంగా మౌలిక వసతులను కల్పించేందుకు సైతం నిధులను కేటాయిస్తుంది. ఖర్చుపై ఎప్పటికప్పుడు సమీక్షించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం పట్టించున్న దాఖలాల్లేవు. బడ్జెట్ రూపకల్పనకు ముందే నిధుల కేటాయింపు, ఖర్చుపై సమీక్షిస్తే.. ఏ మేరకు ఖర్చయ్యాయో లెక్కలు వస్తాయి. అయినా ఏనాడూ నిధుల వ్యయంపై దృష్టిసారించింది లేదు. నిధులు కేటాయించడమే తప్ప ఖర్చు చేసే ఆలోచన లేదని స్పష్టమవుతున్నది. ఇక కొన్ని శాఖలైతే ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదంటే ప్రభుత్వ పర్యవేక్షణ ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.
కాంగ్రెస్ సర్కార్ తీరుపై దళిత, గిరిజన సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దళిత, గిరిజనులకు చేవేళ్ల డిక్లరేషన్ పేరిట అనేక హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు సమీపిస్తున్న అందులో ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అదీగా సబ్‌ప్లాన్ నిధుల కేటాయింపు, ఖర్చుపైనా ఆయా వర్గాలు ని ప్పులు చెరుగుతున్నాయి. సబ్‌ప్లాన్ నిధులు ఖర్చు చేసినట్టు దొంగ లెకలు చూపి బడ్జెట్ పుస్తకాల్లో అంకెల గారడీ చేస్తున్నాయని మం డిపడుతున్నాయి. గత రెండు బడ్జెట్లలో గిరిజనుల సంక్షేమానికి 10,158 కోట్లు కేటాయించినట్టు చెబుతున్నా, రూ.3,700 కోట్లు మా త్రమే ఖర్చు చేసి మిగతా రూ.6వేల కోట్లను దారి మళ్లించి లూటీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత బడ్జెట్లో దళిత, గిరిజనులకు కీలకంగా అభివృద్ధికి ఉపయోగపడే రంగాల్లో కేటాయింపులు తగ్గించి కాం ట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడే రంగాల్లో మాత్రం పెంచి బాగా పెంచామని సర్కార్ గొప్పలు చెబుతున్నదని విమర్శిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం పేరుకే సబ్‌ప్లాన్ నిధులు కేటాయిస్తున్నది. ఖర్చును మాత్రం పట్టించుకోవడం లేదు. ఎస్సీ ఉపకులాలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చి రెండేండ్లు గడిచినా ఊసేలేదు. రుణాలు ఇవ్వడం లేదు. దళితవర్గాలకు కాంగ్రెస్ తీరని ద్రోహం చేస్తున్నది. ఇకనైనా చేవేళ్ల డిక్లరేషన్ అమలు చేయాలి. సబ్‌ప్లాన్ నిధులు దారి మళ్లించకుండా ప్రతిపైసా ఖర్చు చేయాలి.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో గిరిజనుల హకులను కాలరాస్తున్నది. క్యాబినెట్లో లంబాడిలకు మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది. చేవెళ్ల డిక్లరేషన్‌లో ఇచ్చిన 15 హామీలను అటకెక్కించింది. ఇది గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే బడ్జెట్. నిధులివ్వకుండా, నీతులు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబు తాం. బడ్జెట్‌కు నిరసనగా ఎల్‌హెచ్‌పీఎస్, సేవాలాల్ సేన, బంజారా సేవా సంఘం సంయుక్త ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తాం.
