గజ్వేల్, ఆగస్టు 5: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై పిచ్చికూతలు కూస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు.బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ప్రతాప్‌రెడ్డి మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులపై నోటికొచ్చినట్లు మాట్లాడి పరువు తీసుకున్నాడని, సీఎం మాటలపై విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతుండగా, దీనిని నుంచి ఎలా బయటపడాలో తెలియక హరీశ్‌రావు క్షుద్రపూజలు చేశాడని ఎమ్మెల్సీలు అద్దెంకి దయాకర్, రామ్మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడటాన్ని తెలంగాణ ప్రజలు ఛీదరించుకుంటున్నారని అన్నారు. వెంటనే భేషరతుగా హరీశ్‌రావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
కంప్యూటర్ యుగంలో రాకెట్లు తయారు చేసి అద్భుత ఫలితాలు సాధిస్తుండగా, క్షుద్రపూజలు చేస్తున్నారని మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని మండిపడ్డారు. ఎల్‌నినో ప్రభావం ఉంటుందని శాస్త్రవేత్తలు ముందునుంచే చెబుతున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం విఫలమైందన్నారు. అందుకే, హరీశ్‌రావుపై క్షుద్రపూజల అంశాన్ని తీసుకొచ్చి డైవర్షన్ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల వాగ్ధానాలు నెరవేర్చడంతో రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని మండిపడ్డారు.
రేవంత్ సర్కారు ఒక్క ప్రాజెక్టు నిర్మించింది లేదన్నారు. కూలిందన్న కాళేశ్వరం ప్రాజెక్టు నుంచే నీటిని పంపింగ్ చేస్తున్న ప్రభుత్వం తన అవివేకాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. తెలంగాణ సుభిక్షమే లక్ష్యంగా కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేసి అన్నపూర్ణగా మార్చినట్లు వంటేరు ప్రతాప్‌రెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బెండె మధు, నవాజ్‌మీరా, కౌన్సిలర్లు శ్రీధర్, మురళి, బాబు, నాయకులు రవీందర్, నర్సింగరావు, గుంటుక రాజు, రమేశ్‌గౌడ్, స్వామి, కనకయ్య, సంతోష్గుప్త్తా, సురేశ్, రఘుపతిరెడ్డి, కనకసేన, ఉమార్, శివకుమార్, సురేశ్, బీరయ్య, హనుమంతరెడ్డి పాల్గొన్నారు.