న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) తొలిరోజు 43 శాతం సబ్‌స్ర్కైబ్ అయ్యింది. ఈ పబ్లిక్ ఇష్యూ గురువారం మొదలవగా.. రూ.22,569 కోట్ల నిధుల సమీకరణే లక్ష్యంగా వచ్చింది. మొత్తం 8.86 కోట్ల షేర్లు ఆఫర్‌కు రాగా, మొదటిరోజు 3.83 కోట్ల షేర్లకు సరిపడా బిడ్లు వచ్చాయని ఎక్సేంజీల సమాచారం. కాగా, 2024లో వచ్చిన హ్యుందాయ్ మోటర్ ఇండియా రూ.27,870 కోట్ల ఐపీవో తర్వాత ఇదే అతిపెద్దది కావడం విశేషం.
బుధవారం యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి రూ.6,746 కోట్ల నిధులను ఎన్ఎస్ఈ సమీకరించిన సంగతి విదితమే. ఈ మదుపర్లలో ఎల్ఐసీ, గోల్డ్‌మన్ సాచ్స్, జీఐసీ సింగపూర్, అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ, నార్గోస్ బ్యాంక్ వంటివి ఉన్నాయి. ఈ ఐపీవోలో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) కింద ప్రస్తుత వాటాదారుల ద్వారా 12.64 కోట్లదాకా ఈక్విటీ షేర్లున్నాయి. ఒక్కో ఈక్విటీ షేర్ ధరల శ్రేణి రూ.1,700-1,785గా ఉన్నది.
ఆ ప్రతిపాదనేదీ లేదు: సెబీ
పబ్లిక్ ఇష్యూ ముగిసిన తర్వాత లిస్టింగ్ సమయంలో ఎన్ఎస్ఈ తమ సొంత స్టాక్ ఎక్సేంజ్‌పై షేర్ల ట్రేడింగ్‌కు అనుమతి కోరలేదని, అందుకు సంబంధించిన ప్రతిపాదనేదీ రాలేదని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమం సందర్భంగా విలేకరులకు తెలిపారు. అయితే ప్రస్తుతానికైతే ఆ తరహా ట్రేడింగ్‌కు అనుమతైతే లేదని అన్నారు.
మిశ్రమంగా ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 21.86 పాయింట్లు నష్టపోయి 74,314.59 వద్ద ముగిసింది. నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 23,270.60 వద్ద నిలిచింది.