హైదరాబాద్, సెప్టెంబర్ 17 నమస్తే తెలంగాణ): ‘ప్రభుత్వం, అధికారులు చేసిన తప్పులను ప్రజలపై రుద్ది వారిని వేధింపులకు గురిచేయడం దుర్మార్గమైన చర్య. 22ఏ జాబితా విషయంలో ఇప్పటికైనా సీఎం రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలి’ అని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిషేధిత జాబితాలోకి వెళ్లిన పట్టా భూములను ప్రభుత్వమే స్వచ్ఛందంగా పరిశీలించి, తక్షణమే ఆ జాబితా నుంచి తొలగించి ప్రజలకు శాశ్వత ఊరట కల్పించాలని కోరారు.
రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల నిబంధనతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. అసెంబ్లీలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి పరస్పర విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేశారని విమర్శించారు. ఇదే సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ 22ఏ జాబితా రూపకల్పనలో అధికారుల తప్పిదమేనని అంగీకరిస్తూ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారని, ఆ తప్పులన్నింటినీ ప్రభుత్వమే సుమోటోగా స్వీకరించి సరిదిద్దుతుందని స్పష్టమైన హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
కానీ నిన్న సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తప్పులు జరిగాయని అంగీకరిస్తూనే, ఏకంగా 30 లక్షల ఎకరాలను 22ఏలో పెట్టామని, అవన్నీ తమవేనని ఆయా భూముల యజమానులే స్వయంగా ఆధారాలు చూపి నిరూపించుకోవాలని బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు సామాన్య ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఆధారాలు చూపించాలనడం ఏ రకమైన న్యాయమని నిలదీశారు. మొన్నటివరకు హైడ్రా పేరుతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన ప్రభుత్వం.. ఇప్పుడు 22ఏ రూపంలో వణికిస్తున్నదని మండిపడ్డారు.