సిద్దిపేట, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): మెదక్-సిద్దిపేట-ఎలతుర్తి జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తున్నది. 2022లో రూ.1460 కోట్లతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించగా, మూడున్నరేండ్లు గడిచినా పూర్తికాలేదు. దీంతో రోడ్డుపై రాకపోకలకు నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసంపూర్తిగా పనులు చేపట్టడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. గడువు దాటిపోయినా పనులు ఇంకా సంపూర్ణంగా పూర్తికాలేదు. కొన్నిచోట్ల పనులు పూర్తిగా నిలిచిపోగా, మరికొన్ని చోట్ల నత్తనడకన కొనసాగుతున్నాయి.
ఫలితంగా రహదారి మొత్తం గుంతలు, కంకరమయంగా మారి వాహనదారులకు చుకలు చూపిస్తోంది.జాతీయ రహదారిపై చాలాచోట్ల రోడ్డు పూర్తిగా దెబ్బతిన్నది. భారీ గుంతలు ఏర్పడటంతో ద్విచక్ర వాహనదారులు అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నారు. వర్షం పడినప్పుడు గుంతల్లో నీరు నిలిచి వాటి లోతు కనిపించక ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. నాలుగు చక్రాల వాహనాలు తీవ్రంగా దెబ్బతింటుండడంతో వాహనదారులుకు ఆర్థికంగా భారం పడుతున్నది. నాగసముద్రం పరిసర ప్రాంతాల్లో అటవీశాఖ అనుమతుల సమస్య చూపుతూ పనులు నిలిపివేశారు.పెండింగ్ పనులు వేగంగా పూర్తిచేయడంలో సంబంధితశాఖలు విఫలమయ్యాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్, ఎన్హెచ్ఏఐ, రెవెన్యూ, అటవీశాఖల మధ్య సమన్వయం లేక రోడ్డు పనుల్లో పురోగతి కరువైంది.
సిద్దిపేట-ఎల్కతుర్తి జాతీయ రహదారి (765 డీజీ) పనులు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభంచారు. మెదక్ -సిద్దిపేట ఒక బిట్టుగా, సిద్దిపేట- ఎల్కతుర్తి వరకు రెండో బిట్టుగా రహదారిని విభజించి పనులు మొదలుపెట్టారు. సిద్దిపేట- ఎల్కతుర్తి 63.641 కిలో మీట ర్ల రహదారికి రూ. 578.85 కోట్లు, మెదక్ నుంచి సిద్దిపేట వరకు 70 కిలోమీటర్ల రహదారికి రూ. 882 కోట్లు మం జూరు చేసింది.

ఈ జాతీయ రహదారి 765డీజీ 134 కిలోమీటర్లు ఉంటుంది. ఇందులో రెండు టోల్ ప్లాజాలు ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి మెదక్ జిల్లా పోతారెడ్డిపేట నుంచి నిజాంపేట మధ్యలో,రెండోవది సిద్దిపేట జిల్లా పందిల్ల వద్ద ఏర్పాటు చేశారు.త్వరలోనే వినియోగంలోకి తీసుకురానున్నారు.ఈ రహదారి విస్తరణతో మెదక్, సిద్దిపేట, కరీంనగర్, హన్మకొండ, వరంగల్ తదితర జిల్లాలకు కనెక్టివిటీ పెరుగుతుంది. రోడ్డు విస్తరణలో అడ్డంకులను కేసీఆర్ ప్రభుత్వం తొలిగించి, పనుల్లో వేగం పెం చింది. రోడ్డు విస్తరణ పనులు స్పీడ్‌గా జరుగుతున్న సమయంలో ప్రభుత్వం మారడంతో అప్పట్లోనే పనులు నత్తనడకన కొనసాగాయి.
రహదారి వెంట నిర్మించిన సైడ్ డ్రైనేజీలకు అనేక చోట్ల స్లాబ్‌లు వేయకుండానే వదిలేశారు. దీంతో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వేగంగా వెళ్తూ వాహనాలు అదుపు తప్పి అందులో పడి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. రాత్రివేళ వెలుతురు లేకపోవడం, రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు లేక ప్రమాదాలు పొంచిఉన్నాయి. సిద్దిపేట బైపాస్, మిట్టపల్లి రైల్వే ఫె్లైఓవర్, ఎన్సాన్పల్లి ప్రాంతాల్లో పనులు నెలల తరబడి నిలిచిపోయాయి. మిట్టపల్లి రైల్వే ఫె్లైఓవర్ పూర్తికాక రైల్వే గేటు మూసివేసిన ప్రతీసారి వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నాయి. ఉద్యోగులు,విద్యార్థులు,రైతులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చికుకుంటున్నారు.
అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో ఇరుకు పోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే జాతీయ రహదారిపై కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, డైవర్షన్ సూచికలు, రిఫ్లెక్టర్లు, రాత్రి వెలుతురు వంటి ఏర్పాట్లు చేయకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. జాతీయ రహదారి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, గుంతలను వెంటనే పూడ్చాలని, తెరిచి ఉన్న డ్రైనేజీలకు స్లాబ్‌లు వేయాలని, ఫె్లైఓవర్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, ప్రమాద ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, హైమాస్ట్‌లైట్లు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.