హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించిన వైద్యులకు ఇన్సెంటివ్లు చెల్లించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం డీఎంఈ వాణికి అసోసియేషన్ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్కుమార్ బొల్లెపాక, కిరణ్ మాదాల మాట్లాడుతూ.. పెరిఫెరల్ మెడికల్ కాలేజీల అలవెన్సులు చెల్లించాలని కోరారు. టీచింగ్ ఫ్యాకల్టీకి ఎయిమ్స్ తరహాలో పే స్కేల్ అమలుచేయాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ ప్రమోషన్లు కల్పించాలని, సూపర్ స్పెషాలిటీ వైద్యులకు అలవెన్సుల విధానాన్ని ప్రవేశపెట్టాలని కోరారు.