మంచిర్యాల టౌన్ : ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఐటీ పార్కు (IT Park) కోసం భూములు తీసుకుంటున్న హాజీపూర్ మండలంలోని వేంపల్లి, ముల్కల్ల ,పోచంపాడు గ్రామ దళిత రైతులకు అండగా నిలబడతామని మంచిర్యాల మాజీ శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు ( Former MLA Diwakar Rao ) అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో భూ బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
వేంపల్లి గ్రామ శివారులో ఇండస్ట్రియల్ హబ్( Industrial Hub) , ఐటీ పార్క్ ఏర్పాటు కోసం సేకరిస్తున్న 300 ఎకరాల భూమికి, ఎకరానికి రూ. 13 లక్షల పరిహారం ప్రకటించడం దారుణమని, ప్రస్తుతం అక్కడ పట్టా భూమికి 50 లక్షలు ఎకరానికి పలుకుతుందన్నారు. ఈ భూముల్లో ఎక్కువగా ఎస్సీలకు చెందిన వారికే ఎక్కువగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ భూములను ఉచితంగా పంపిణీ చేశామని గుర్తు చేశారు.
2013 యాక్ట్ ప్రకారం అనగా 2013 భూ సేకరణ చట్టం ప్రకారం అసైన్డ్ ల్యాండ్స్ కు సైతం పట్టా భూమితో సమానంగా పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్టు నిచ్చిందని వెల్లడించారు. ఈ చట్టం ప్రకారం ఆ ప్రాంతంలో జరిగిన లావాదేవీలను పరిగణలోకి తీసుకొని ఆ రేటుకు మూడు రెట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ విలువ ప్రకారం ఆ ప్రాంతంలో ఎకరానికి 6.50 లక్షలు ఉందని, దీన్ని బట్టి మూడు రెట్లు కలిపి రూ. 26 లక్షల చెల్లించవలసి ఉంటుందన్నారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్భలంతో..
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రోద్భలంతో దళిత రైతులను బెదిరించి ఆర్డీవో, ఎమ్మార్వో సంతకాలు స్వీకరించి రూ.13 లక్షలకు ఖరారు చేయడం అక్రమమని ఆరోపించారు. ఇది కేవలం మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లబ్ధి పొందడానికి మాత్రమే చేస్తున్న ప్రక్రియ అని విమర్శించారు. దళితుల నుంచి రూ. 13 లక్షలకు భూమిని కొనుగోలు చేసి అక్కడ ఇండస్ట్రియల్ హబ్ ఏర్పాటు అయ్యాక కోట్లలో అమ్మి డబ్బులు దండుకోవచ్చని కుట్ర అని మండిపడ్డారు.
రైతులకు న్యాయం జరిగే వరకూ తాము రైతుల పక్షాన పోరాడుతామని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, మాజీ సర్పంచులు బేర పోచయ్య, మంచాల శ్రీనివాస్, మాజీ వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్, నాయకులు రావుల వెంకటేష్, కుడుక సత్యం, బాధితులు శేఖర్,సతీష్ ,మహిళా రైతులు పాల్గొన్నారు.