ఎస్సారెస్పీ ఆయకట్టు రైతాంగం ఆగమైతున్నది. పంట చేతికి రాకముందే మరో పది రోజుల్లో యాసంగి పంటలకు వారబంధీ తడులు బంద్ చేస్తామన్న ప్రకటనతో ఆందోళన పడుతున్నది. గతేడాది డిసెంబర్లో రూపొందించిన నీటి పంపిణీ ప్రణాళిక ప్రకారం జోన్-2 పరిధిలోని డిస్ట్రిబ్యూటరీలకు వచ్చే నెల 2న ఉదయం 6 గంటలకు, జోన్-1 పరిధిలో కాలువలకు 9వ తేదీ ఉదయం 6 గంటలకు నీటి పంపిణీని నిలిపివేస్తామని అధికారులు ఇటీవల పేర్కొనగా, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల పరిధిలోని కర్షకులు ఆవేదన చెందుతున్నారు. నీరు వస్తుందనే నమ్మకంతో జనవరి నెల చివరి వరకు నాట్లు వేశామని, ఇంకా కోతకు రాకముందే కచ్చితంగా నీరందించాల్సిన టైంలో సరఫరా ఆపివేస్తే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి మరో రెండు తడులు ఇవ్వాలని కోరుతున్నారు.
జగిత్యాల, మార్చి 30(నమస్తే తెలంగాణ)/ పెద్దపల్లి (నమస్తే తెలంగాణ) : యాసంగిలో ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలోని జోన్ 1, 2 పరిధిలో ఉన్న నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలో 4,42,920 లక్షల ఎకరాల పంటలకు నీరందించేందుకు ఎస్సారెస్పీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డిస్ట్రిబ్యూటరీ 5 నుంచి 53 వరకు జోన్-1గా, డిస్టిబ్యూటరీ 54 నుంచి 94 వరకు జోన్ -2గా వర్గీకరించారు. జోన్-1కు ఏడు రోజులు ఆన్, 8 రోజులు ఆఫ్గా.. జోన్-2కు 8 రోజులు ఆన్, 7 రోజులు ఆఫ్ పద్ధతిలో ఇవ్వాలని నిర్ణయించారు. అయితే డిసెంబర్ 25న ఎస్సారెస్పీలో 80.501 టీఎంసీల నీరు ఉండగా, అందులో 63.85 టీఎంసీలు ఈ రెండు జోన్ల పరిధిలోని పంటలకు ఇవ్వాలని ప్రణాళిక రూపొందించారు. ఈ క్రమంలో డిసెంబర్ 25న వారబంధీ పద్ధతిలో తొలుత కాకతీయ కాలువ ద్వారా జోన్-2కు నీటి విడుదలను ఆరంభించారు. ఈ యేడాది జనవరి 2న జోన్-1కు నీటి విడుదల చేశారు. దాదాపు రెండు నెలలుగా వారాబంధీ పద్ధతిలో సరఫరా చేస్తున్నారు.
వారబంధీ పద్ధతిలో నీటి విడుదల కొనసాగుతూ వస్తున్న జోన్ -1, 2 డిస్ట్రిబ్యూటరీల పరిధిలో రైతులకు సాగునీటి కష్టాలు తప్పడం లేదు. కాలువల నిర్వహణ సరిగా లేకపోవడం, చాలా చోట్ల కెనాళ్లపై మోటర్లు పెట్టి నీటిని తోడుకుంటూ ఉండడం, నీటి చౌర్యం, కాలువల నిర్వహణలపై అధికారుల నిఘా సరిగా లేకపోవడంతో చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు సరిగా అందక ఇప్పటికే వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిన్నది. ఎస్సారెస్పీ అధికారుల అంచనాల ప్రకారమే ప్రాజెక్టు పరిధిలోని కాలువల వెంబడి 3వేల మోటర్లు పనిచేస్తుండగా, వదిలిన నీటిలో 500 క్యూసెకులను అవే లాగేస్తున్నాయని అధికారులు పేరొంటున్నారు. వాస్తవానికి క్షేత్రస్థాయిలో ఐదువేల వరకు విద్యుత్ మోటర్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ మోటర్లపై అధికారుల పర్యవేక్షణ సరిగా లేకపోవడంతో చివరి ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి ఎదురైంది. దీనికి తోడు కాకతీయ ప్రధాన కాలువతోపాటు, డిస్టిబ్యూటరీ కాలువలకు చాలా చోట్ల లైనింగ్లు లేవు. పిచ్చిమొకలు మొలిచి ధ్వంసమైపోవడం, నీరు వృథాగా పోతుండడం రైతుల పాలిట శాపంలా మారింది. జోన్ -1 పరిధిలో ఉన్న జగిత్యాల జిల్లాలోనే పలు డిస్ట్రిబ్యూటరీల చివరి ప్రాంతాలకు నీరందని పరిస్థితి నెలకొనడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జోన్- 1 పరిధిలోకి వచ్చే డీ 53 డిస్ట్రిబ్యూటరీ ద్వారా నీటి పంపిణీ జరిగే సారంగాపూర్, బీర్పూర్ మండలాల్లోని చివరి ఆయకట్టు ప్రాంతాలైన బట్టపెల్లి, పోతారం లాంటి గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. జోన్-2 పరిధిలో ఉన్న డీ83/ఏ డిస్టిబ్యూటరీ పరిధిలోకి వచ్చే వెల్గటూర్, తదితర మండలాల్లోని గ్రామాలకు సైతం నీరందక రైతులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ఇక పెద్దపల్లి జిల్లాకు సాగునీరందించే డిస్ట్రిబ్యూటరీలు 83, 86 పరిధిలోని చివరి ఆయకట్టు ప్రాంతాల రైతులు గత పదేండ్లుగా ఏనాడు ఎదుర్కొనంత ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే భారీగా పంటలు దెబ్బతినడంతో పొలాలను పశువులకు మేతకు వదిలేస్తున్నారు.
మరో పది రోజుల వ్యవధిలో ప్రాజెక్టు పరిధిలోని జోన్-1,2 పరిధిలోని డిస్టిబ్యూటరీలకు నీటి విడుదలను నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. డిసెంబర్25న జోన్-2 పరిధిలోని కెనాళ్లకు వారబంధీ పద్ధతిలో ప్రారంభమైన నీటి విడుదల ప్రక్రియ ఏప్రిల్ 2న గడువు ముగుస్తుందని, జోన్-1 పరిధి ఆయకట్టుకు ఏప్రిల్ 9న గడువు ముగుస్తుందని అధికారులు పేరొంటూ వచ్చారు. అయితే ప్రాజెక్టులో గతేడాదితో పోలిస్తే దాదాపు ఏడెనిమిది టీఎంసీల నీరు అధికంగా ఉన్న నేపథ్యంలో ఏప్రిల్ మూడో వారం వరకు పంటలకు నీటి తడులు ఇస్తారన్న నమ్మకంతో ఇన్నాళ్లు రైతులు సేద్యం చేస్తూ వచ్చారు. అయితే ఏప్రిల్ మొదటి వారంలో నీటి తడులు నిలిపివేస్తామని స్పష్టంగా ప్రకటించడంతో రైతులు తీవ్రంగా భయపడుతున్నారు. వాస్తవానికి నవంబర్ చివరి వారంలోను, డిసెంబర్ మొదటి వారంలో పంట ప్రారంభించిన వారికి ఏప్రిల్ మొదటి వారం వరకు పంట కోతకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది ఎస్సారెస్పీ ప్రాజెక్టు పరిధిలో యాసంగి నార్లు పోయడం ఆలస్యమైంది. జనవరి చివరి వారం వరకు నార్లు పోస్తూనే వచ్చారు. చివర్లో నాట్లు వేసిన రైతులకు పంట ఏప్రిల్ చివరి వారం నుంచి మే మొదటి రెండు వారాల్లో కోతకు వస్తాయి. వారబంధీ పద్ధతిలో నీటి విడుదల చేసిన సమయంలోనే ఆయకట్టు చివరన ఉన్న తమకు నీరు రావడం లేదని, ఏప్రిల్ 9వ తేదీ నాటికే నీటి తడులు నిలిచిపోతే పంట పూర్తిగా నష్టపోయినట్లేనని బాధపడుతున్నారు.
ఎస్సారెస్పీ నుంచి నీటి విడుదల నిలిపివేస్తామని అధికారులు చెబుతున్న మాటలతో సన్నాల సాగు చేసిన రైతులు, ఆలస్యంగా పంటలు వేసిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మార్కెట్లో అత్యంత గిరాకీ ఉన్న సన్నాలు పండిస్తే బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో ఎక్కువ మంది సాగు చేసిన విషయం తెలిసిందే. అయితే దొడ్డురకం కంటే సన్నరకం సాగు చేయడం కష్టంతో, ఇబ్బందులతో కూడుకుంటుంది. దొడ్డురకం పంటకాలం 135 రోజులు కాగా, సన్నరకం పంటకాలం 165 రోజులు. నెల రోజులు అదనంగా రైతు శ్రమించాల్సిన పరిస్థితి. పంటపెట్టుబడి సైతం పెరుగుతుందని, సాధారణ రకాల సాగు పెట్టుబడితో పోల్చిచూస్తే ఎకరానికి 4వేల నుంచి 5వేల వరకు అధికంగా పెట్టుబడి అవుతుందని రైతులు చెబుతున్నారు. పంట కాలం అధికంగా ఉండడంతో సన్నాలకు నీటి తడులు సైతం ఎక్కువగానే ఇవ్వాల్సిన అవసరం ఉంటుందని పేర్కొంటున్నారు. ఇప్పుడు 130-150 రోజుల మధ్యలోనే నీటి తడులను నిలిపివేస్తే తమ పంటలు ఏం కావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక దొడ్డు రకానికి సంబంధించిన పంటను సాగు చేస్తున్న రైతులు కొందరు జనవరి మధ్య వారం నుంచి చివరి వారం వరకు నాట్లు వేశారు. పంట ఇప్పుడు 90-110 రోజుల మధ్యలో ఉందని, మరో పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు తడి అవసరమని ఇప్పుడే నీటి విడుదల నిలిపివేస్తే తమ గతేం..? కావాలని రైతులు దిగులు పడుతున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ఆలోచన చేయాలని కోరుతున్నారు.
ఆయకట్టు చివరి రైతులతో పాటు, ఎస్సారెస్పీ డిస్ట్రిబ్యూటరీల పరిధిలో పంటలు సాగు చేస్తున్న చాలా మంది రైతులు ఏప్రిల్ చివరి వారం వరకు నీటి తడులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతంలో కేసీఆర్ హయాంలో కాళేశ్వరం నుంచి నీటిని ఎత్తిపోసి, డిస్టిబ్యూటరీల ద్వారా నీటిని విడుదల చేశారని, ఇప్పుడు సైతం అలాగే నీరందించాలని కోరుతున్నారు. లేదంటే రైతుల పంటలకు ప్రత్యామ్నాయాలు చూపాలని కోరుతున్నారు. ఇలా అర్ధంతరంగా తమను వదిలేయవద్దని వేడుకుంటున్నారు.
మాది కాల్వశ్రీరాంపూర్ మండలం మల్యాల. గ్రామ శివారులో నాకు నాలుగెకరాల భూమి ఉన్నది. సన్న రకం నెల్లూరు సాంబ అనే వెరైటీ సాగు చేసిన. వాన కాలంలో బోనస్ ఇచ్చినట్టుగానే యాసంగిలో కూడా ఇస్తామంటే, సాగుచేసిన. ఇప్పుడే పొట్టకు వచ్చి ఈనే దశలో ఉన్నది. మరో 20 రోజులు నీళ్లు అవసరం. కానీ ప్రభుత్వం ఏప్రిల్ 2 వరకు చివరి తడుపు ఇస్తామంటే మాసోంటి రైతుల గతేంకాను. నోట్లోకి వచ్చిన పంట ఎండిపోయే పరిస్థితి ఉంటది. ప్రభుత్వం స్పందించి మరో 20 రోజులు నీరందించాలి. రైతులను ఆదుకోవాలి.
జిల్లా అంతట వేరు. మా మంథని ఏరియాలో వేరు. ఎందుకంటే మేం 20రోజులు ఆలస్యంగా నాట్లు వేస్తం. మాకు అట్లాంటి పరిస్థితే ఉంటది. ఏప్రిల్ 2న చివరి తడుపు ఇస్తే సరిపోదు. ఇంకో తడుపు అయితేనే పొలం బతుకుతది. లేకుంటే తీవ్రంగా పంట నష్టపోతం. ప్రభుత్వం స్పందించి ఏప్రిల్ రెండో వారంలో మరో తడుపు ఇవ్వాలి. లేకపోతే చేతికచ్చిన పంట పోతది.