షాబాద్, జూలై 30 : సీపీఐ రంగారెడ్డిజిల్లా 17వ మహాసభలను విజయవంతం చేయాలని సీపీఐ షాబాద్ మండల కార్యదర్శి పాలమాకుల శ్రీశైలం అన్నారు. బుధవారం షాబాద్ మండల కేంద్రంలో మహాసభల వాల్పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మొయినాబాద్ మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్లో ఆగస్టు 2వ తేదిన జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అధ్యక్షతన సీపీఐ రంగారెడ్డిజిల్లా 17మహాసభలు జరుగుతాయని చెప్పారు. ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకట్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నరసింహ తదితరులు హాజరుకానున్నట్లు తెలిపారు.
ఈ మహాసభలకు జిల్లా నలుమూలల నుండి 400 మంది ప్రతినిధులు హాజరవుతున్నారని, ఈ మహాసభలలో రంగారెడ్డిజిల్లాలో అన్ని గ్రామాలకు పార్టీ గ్రామా శాఖల నిర్మాణం చేపట్టడానికి భవిష్యత్తు కార్యాచరణ, ప్రజాసంఘాలను బలోపేతం చేయడానికి, ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్ల స్థలాలు, ఇండ్ల పట్టాల కోసం భవిష్యత్తు కార్యాచరణ చేపడతారని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల నుండి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల మాజీ కార్యదర్శి నక్కలి జంగయ్య, పార్టీ మండల కౌన్సిల్ సభ్యులు రఘురాం, మధు, నారాయణ, రుక్కయ్య తదితరులున్నారు.