Srisailam | శ్రీశైలం, కాశీ పుణ్య క్షేత్రాలు రెండూ నమకం, చమకాలకు ప్రతీకల్లాంటివి బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పేర్కొన్నారు. అలాగే నమక చమకాలు సృష్టికి ప్రతిబింబాలుగా ఉంటాయన్నారు. గురువారం సాయంత్రం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
శ్రీశైల మహాక్షేత్రంలో కార్తీక మాసోత్సవాల సందర్భంగా ఆలయ దక్షిణ మాడవీధి కళారాధన వేదికపై ఈవో పెద్దిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నమక చమక వైభవం ప్రత్యేక ప్రవచన కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాడుగుల నాగఫణి శర్మ ప్రసంగిస్తూ, ఒకే ప్రాంగణంలో శక్తి పీఠం జ్యోతిర్లింగం కలిసి వెలసిన ఏకైక ఆలయ ప్రాంగణంలో నమక చమక వైభవం గురించి ప్రస్తావించడం శుభదాయకంగా ఉందన్నారు.
రుద్రం అంటేనే నమక చమకాల కలయిక అని నాగఫణి శర్మ వర్ణించారు. సకల దేవతా స్వరూపాన్ని, విశ్వమంతా రుద్రుడు ఉన్నాడని చాటి చెప్పే పంచ సూక్తాలను పఠించినా, శ్రవణం చేసినా శుభఫలితాలు కలుగుతాయని భక్తులకు వివరించారు. నమక చమక మంత్ర విషయాలను తెలిపే యజుర్వేద ప్రాముఖ్యాన్ని తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో చేసే జపాలు, పారాయణాలు, హోమాలకు విశేష ఫలితాలు కలుగుతాయని అన్నారు. కార్యక్రమంలో ఈవో పెద్దిరాజు, శ్రీశైలప్రభ సంపాదకుడు కుడిపె అనిల్‌కుమార్, ఈఈ రామకృష్ణ తదితరులు ఉన్నారు.