హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలో కులవృత్తులపై ఆంక్షలు విధించడం, ధిక్కరించిన వారిపై గ్రామ బహిష్కరణ చేసిన ఘటనపై సమగ్ర విచారణ జరుపాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కల్లు గీయడం, చేపలు పట్టడం, అమ్మడం, చావు డప్పులు కొట్టడం, బట్టలు ఉతకడం, క్షవరం చేయడం తదితర వాటిపై రేట్లు నిర్ణయించి.. ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ధిక్కరించిన వారిని గ్రామ బహిష్కరణ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఆర్మూర్ పరిసర ప్రాంతాల్లో నాయీ బ్రాహ్మణులు, రజకులు, గొల్ల కురమలు, గీత కార్మికులు, మత్స్యకారుల సామాజిక వివక్షపై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరారు. ఓబీసీ అడ్వొకేట్ జేఏసీ చైర్మన్ దేవరాజు, బాధితులు పాల్గొన్నారు.