నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థుల ప్రకటన వ్యవహారం ఆదిలోనే హంసపాదులా మారింది. ఏదో మునిగిపోతున్నట్టుగా ఎవరికీ సమాచారం ఇవ్వకుండానే రాత్రికి రాత్రే అభ్యర్థులను ప్రకటించడం ఏందన్న చర్చ మొదలైంది. మంగళవారం రాత్రి అలా అభ్యర్థులను ప్రకటించారో లేదో బుధవారం తెల్లవారే సరికే అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి.
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాలతో సంబంధం ఉన్న ఈ ఎన్నికలో అభ్యర్థి ప్రకటనపై ఇలానే వ్యవహరిస్తారా? అంటూ సీనియర్లు ఫైర్ అవుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు అనుకుని ఏకపక్షంగా అభ్యర్థులను ఖరారు చేసి, ఏఐసీసీతో ప్రకటింపచేయగానే సరిపోతుందా? అని సవాలు చేస్తుండటం ఆసక్తి కలిగిస్తున్నది. ఇతర నేతలకు ఏమో గానీ కనీసం ఎంపిక చేసిన అభ్యర్థి అభిప్రాయానికైనా విలువ ఇవ్వలేదన్న చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గానికి తమ అభ్యర్థిగా రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని కాంగ్రెస్ అధిష్ఠానం మంగళవారం రాత్రి పొద్దుపోయాక ప్రకటించింది.
ఈ ప్రకటన గురించి ఈ మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలకు కనీసం సమాచారం లేదన్నది నిజం. వాస్తవంగా మూడు రోజుల కిందట నుంచే ఓటర్ ఎన్రోల్మెంట్ ప్రారంభం కాగా ఎన్నికలకు మరో ఐదు నెలల గడువు ఉన్నది. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ఇంత ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తుందని సొంత పార్టీ నేతల ఊహకు కూడా తట్టలేదని సమాచారం. ప్రస్తుతం ప్రకటించిన రాంరెడ్డి సర్వోత్తంరెడ్డితోపాటు సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ శ్రీనివాస్, మరో నేత చెనగాని దయాకర్‌గౌడ్ పేర్లను అధిష్ఠానానికి పంపారన్న చర్చ ఉన్నా వీరిలో ఎవరు ఫైనల్ అన్నది తేల్చలేదు. కానీ ఇందులో ఎవరి భాగస్వామ్యం లేకుండానే కేవలం సీఎం, డిప్యూటీ సీఎంలు సూచనప్రాయంగా అనుకున్నట్టు తెలిసింది. వీరి అభిప్రాయం మేరకు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని అభ్యర్థిగా ఏఐసీసీ ప్రకటించినట్టు సమాచారం.
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనుకుని అభ్యర్థిని ఏకపక్షంగా ఫైనల్ చేయడం ఏందని కాంగ్రెస్ సీనియర్లు ఫైర్ అవుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే ప్రకటించడంలో ఆంతర్యమేందని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాల్సిన సీనియర్లను, ఎమ్మెల్యేల అభిప్రాయాలకు విలువ ఇవ్వకుంటే తామెందుకు పని చేయాలన్న చర్చను లేవనెత్తారు. ముఖ్యంగా సీనియర్ మంత్రి ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అభ్యర్థి ప్రకటన అస్సలు మింగుడు పడటం లేదని తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంగళవారం మొత్తం ఉత్తమ్ కూడా ఢిల్లీలోనే ఉన్నారు.
వీరివురూ కలిసి పలువురు కేంద్ర మంత్రులతోపాటు ఏఐసీసీ పెద్దలతోనూ భేటీ అయ్యారు. కనీసం పార్టీ పెద్దలు సైతం అభ్యర్థుల ప్రకటన విషయం ఉత్తమ్ దృష్టికి తేలేదని తెలిసింది. తీరా రాత్రి ప్రకటన చూశాక కంగుతినడం ఉత్తమ్ వంతైంది. దీంతో ఆయన రాత్రి నుంచి ఫుల్ ఫైర్ మీద ఉండి పొద్దున్నే పార్టీ ముఖ్యులతోపాటు తన సన్నిహితుల వద్ద అసంతృప్తిని వెళ్లగక్కినట్టు తెలిసింది. ఉత్తమ్ పరిస్థితి ఇలావుంటే అమెరికాలో ఉన్న నల్లగొండకే చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కనీసం పరిగణనలోకి తీసుకోలేదని సమాచారం. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇక ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగిన నాథుడే లేనట్టు తెలిసింది. ప్రకటన చేసే ముందు కనీసం అభ్యర్థి సొంత అభిప్రాయానికైనా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదా? అని ఉత్తమ్ ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.
ఏఐసీసీ ప్రకటించిన అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తంరెడ్డిని సైతం పార్టీ నిర్ణయం తీవ్ర విస్మయానికి గురిచేసినట్టు ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మండలి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచన, ఆసక్తి తనకు లేదని ఆయన కొంతకాలంగా చెప్తూ వస్తున్నారు. ఇదే విషయం మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డితోపాటు కొందరు ఎమ్మెల్యేలకు, పార్టీలోని సీనియర్లకు సైతం స్పష్టంచేసినట్టు సమాచారం. తన తండ్రి దామోదర్‌రెడ్డి వారసత్వంగా ఆయనకు ఇచ్చిన మాట మేరకు వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గం నుంచే అసెంబ్లీకి పోటీ చేయాలన్నది తన సంకల్పమని తేల్చిచెప్పినట్టు తెలిసింది.
వారం రోజులుగా తన పేరు కాంగ్రెస్ ఆశావహుల జాబితాలో వస్తుండగా సర్వోత్తంరెడ్డి అలర్ట్ అయ్యారు. తనకు మండలి ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆసక్తి లేదని చెప్పడానికి ఐదు రోజుల కిందట సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అపాయింట్మెంట్ కోరినా సమయం ఇవ్వలేదని తెలిసింది. మూడు రోజుల కిందట మరోసారి ప్రయత్నం చేయగా ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కలుద్దామని సీఎం చెప్పినట్టు సమాచారం. కానీ సీఎం ఢిల్లీ నుంచి రాకముందే అభ్యర్థుల ప్రకటన జరిగింది. ఈ ప్రకటనతో సర్వోత్తంరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సన్నిహితుల ద్వారా తెలిసింది.
ఉత్తమ్‌తో టచ్‌లో ఉన్న సర్వోత్తంరెడ్డి తన అసంతృప్తిని బయటకు వెళ్లగక్కకుండా సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా రంగంలోకి దిగారు. వెంటనే సర్వోత్తంరెడ్డిని లైన్లోకి తెచ్చుకుని గమ్మునుండాలని ఆదేశించినట్టు సమాచారం. తర్వాత పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌ను రంగంలోకి దింపారు. ఆయన ఇద్దరు అభ్యర్థులు రాంరెడ్డి సర్వోత్తంరెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డిలకు ఫోన్‌చేసి తన ఇంటికి పిలిపించుకున్నారు. మీడియాలో అప్పటికే వస్తున్న వార్తలను తప్పు అన్నట్టుగా చిత్రీకరించేందుకు అభ్యర్థులు పీసీసీ చీఫ్‌నకు కృతజ్ఞతలు తెలిపినట్టుగా ఫొటోలు లీక్ చేసి అంతా సవ్యంగానే సాగినట్టుగా దిద్దుబాటు చర్యలకు దిగారు.