తెలుగు యూనివర్సిటీ, సెప్టెంబర్ 30 : పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లను బీసీలకు కేటాయించకుండా అగ్రకులాలకే కేటాయించడం సిగ్గుచేటని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బీసీలు పనికిరారా? అని ప్రశ్నించారు. అగ్రకుల అభ్యర్థులను మార్చి, ఆ సీట్లను బీసీలకు ఇవ్వాలని, లేనిపక్షంలో ఓటమికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు.
బుధవారం సైఫాబాద్ బీసీ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. త్వరలో జరుగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా కాంగ్రెస్ పార్టీ, రెడ్డి సామాజికవర్గానికి అవకాశం ఇచ్చి రాష్ట్రంలో సామాజిక న్యాయాన్ని బొందపెట్టిందని ధ్వజమెత్తారు. సమావేశంలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు కే శ్రీనివాస్, సభ్యులు కే శ్యామ్, ఆర్ నరేశ్, శ్రీనివాస్, నరసింహనాయక్, జీ భాస్కర్, కే చందు పాల్గొన్నారు.