హైదరాబాద్, జూన్ 25(నమస్తే తెలంగాణ): రేర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల వల్ల తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తంచేశారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సైతం దెబ్బతినే అవకాశముందని, దీనిపై వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమల్లో వినియోగించే రేర్ ఎర్త్(ఆక్సైడ్లు, లవణాల సమ్మేళనాలతో కూడిన ఉత్పత్తులు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ వంటి సాంకేతికతల్లో ఈ ఉత్పత్తులు అత్యంత కీలకం) ఉత్పత్తులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామని, ముఖ్యంగా రేర్ ఎర్త్ మాగ్నైట్లు, కీలక ముడి పదార్థాలు, రసాయనాలు కూడా చైనాపైనే ఆధారపడుతున్నామని తెలిపారు.
అయితే ఇటీవల చైనా ఈ ఉత్పత్తుల ఎగుమతులపై ఆంక్షలు విధించడంతో రాష్ట్రంలోని పరిశ్రమలు సంక్షోభంలోకి కూరుకుపోయాయని చెప్పారు. చైనా తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ తయారీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నదని ఆయన..ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని, దీనివల్ల ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన కేంద్ర మంత్రికి విజ్ఞప్తిచేశారు. అనంతరం శ్రీధర్ బాబు.. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి ఆయనకు కూడా చైనా ఆంక్షల పర్యవసానాలపై వివరించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు.
రూ. 400 కోట్లు మంజూరు చేయండి…
హైదరాబాద్-నాగ్‌పూర్, హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-విజయవాడ ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, జహీరాబాద్‌లో అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రీయల్ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద అవసరమైన మౌలిక సదుపాయాల కోసం రూ.400 కోట్ల నిధులు పీఎం గతిశక్తి పథకం కింద మంజూరు చేయాలని శ్రీధర్ బాబు గోయల్‌కు విజ్ఞప్తి చేశారు. అలాగే, హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్(హెచ్‌డబ్ల్యూఐసీ)లో భాగంగా ఉన్న ఫార్మాసిటీని ప్రభుత్వం ఇప్పుడు ‘ఫ్యూచర్ సిటీ’గా అభివృద్ధి చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా.. వరంగల్ ఎయిర్ పోర్ట్ అభివృద్ధితో సహా ఇతర ప్రాజెక్టులకు కేంద్రం నిధులు విడుదల చేయాలని కోరారు. కేంద్రం ప్రతిపాదించిన 100 పారిశ్రామిక పారుల పథకం కింద తెలంగాణలో పారుల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని, హైదరాబాద్‌లో ఎన్డీసీని ఏర్పాటు చేయాలని, కేంద్రంతో కలిసి వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో రాష్ట్రం ముందుంటుందని శ్రీధర్ బాబు పేరొన్నారు. అనంతరం శ్రీధర్‌బాబు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్టవ్‌తో సైతం భేటీ అయ్యారు.
పీఎస్‌యూల భూములపై చర్యలు తీసుకోండి..
ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో కేటాయించిన భూములకు సంబంధించిన సమస్యల పరిషారానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని శ్రీధర్ బాబు కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. చాలా సంస్థలు ఇప్పటికే మూతపడ్డాయని, వీటిలో కొన్ని సంస్థలను వాణిజ్యపరంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన చెప్పారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పన కోసం హైదరాబాద్ చుట్టుపకల విలువైన భూములను భారీ ఎత్తున రాయితీ ధరలకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిందని, అయితే కాలక్రమంలో వాటిలో అనేక సంస్థలు మూతపడగా, మరికొన్ని సంస్థలు ఉత్పత్తి నిలిపేసినట్లు పేర్కొన్నారు.
జిల్లాలవారీగా ముఖ్యమైన సీపీఎస్‌యూలకు భూకేటాయింపుల వివరాలు (ఎకరాల్లో)..