గత మ్యాచ్‌తో పోలిస్తే శ్రీలంక మెరుగ్గానే ఆడినా.. రోహిత సేన విజృంభణ ముందు నిలువలేకపోయింది. నిషాంక, షనక దూకుడుతో లంక భారీ స్కోరు చేస్తే.. మనవాళ్లు మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించారు. నిలకడకు మారుపేరుగా మారిన శ్రేయస్ అయ్యర్ యాంకర్ రోల్ పోషించగా.. సంజూ శాంసన్ దంచికొట్టాడు. ఇక ఆఖర్లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫలితంగా స్వదేశంలో వరుసగా ఏడో సిరీస్ ఖాతాలో వేసుకున్న టీమ్ఇండియా.. నేడు నామమాత్రమైన మూడో టీ20 బరిలోకి దిగనుంది!
ధర్మశాల: టీమ్ఇండియా జోరు ముందు మరోసారి లంకేయులు తలవంచారు. మొదట బ్యాటింగ్‌లో రాణించి భారీ స్కోరు చేసినా.. భారత మిడిలార్డర్ పవర్ ముందు ఆ లక్ష్యం చిన్నబోయింది. హిమగిరుల నడుమ శనివారం జరిగిన రెండో టీ20లో రోహిత్ సేన 7 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తుచేసింది. 2-0తో సిరీస్ చేజిక్కించుకున్న టీమ్ఇండియా.. స్వదేశంలో వరుసగా ఏడో టీ20 సిరీస్ ఖాతాలో వేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంక నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్ పథుమ్ నిషాంక (75; 11 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా.. ఆఖర్లో కెప్టెన్ దసున్ షనక (19 బంతుల్లో 47 నాటౌట్; 2 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. వీరిద్దరి ధాటికి ఆఖరి ఐదు ఓవర్లలో లంక 80 పరుగులు పిండుకోవడం విశేషం. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా, హర్షల్, చాహల్, జడేజా తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 17.1 ఓవర్లలో 3 వికెట్లకు 186 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (1)తో పాటు గత మ్యాచ్ హీరో ఇషాన్ కిషన్ (16) ఎక్కువసేపు నిలువలేకపోగా.. శ్రేయస్ అయ్యర్ (44 బంతుల్లో 74 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతడికి సంజూ శాంసన్ (25 బంతుల్లో 39; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రవీంద్ర జడేజా (18 బంతుల్లో 45 నాటౌట్; 7 ఫోర్లు, ఒక సిక్సర్) చక్కటి సహకారం అందించారు. గత మ్యాచ్‌లో అద్భుత అర్ధశతకంతో అలరించిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించగా.. చాన్నాళ్ల తర్వాత చాన్స్ దక్కించుకున్న శాంసన్ తొలుత తడబడ్డా క్రీజులో కుదురుకున్నాక ఇరగదీశాడు. ఇక బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా లంకేయులను ఊచకోత కోశాడు.
శ్రీలంక: 20 ఓవర్లలో 183/5
(నిషాంక 75, షనక 47 నాటౌట్;
బుమ్రా 1/24, చాహల్ 1/27),
భారత్: 17.1 ఓవర్లలో 186/3
(శ్రేయస్ 74 నాటౌట్, జడేజా 45 నాటౌట్; లహిరు 2/31).