గుడి కడితే వెయ్యేండ్ల పాటు చరిత్రలో నిలవాలి.. పునాది నుంచి గోపురం దాకా పటిష్ఠంగా ఉండాలి..భూకంపాలు వచ్చినా తట్టుకొనే శక్తి కలిగి ఉండాలి..పది తరాలకు సరిపడా సదుపాయాలుండాలి..యాదాద్రి ఆలయం అంతటి బలాన్నే పొందిందిప్పుడు!అందులో గుడి చుట్టూ నిర్మించిన రిటైనింగ్ వాల్ పాత్రే ప్రధానం
హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ప్రధాన ఆలయ స్థలం అంతా కలిసి అరెకరం (2,220 చదరపు అడుగులే). చిన్న గుడి, చిన్న గుండం. స్వామివారి బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో వేల సంఖ్యలో భక్తులు వస్తే అంతే సంగతులు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలయాన్ని విస్తరించి, వెయ్యేండ్లకు తగ్గట్టు తీర్చిదిద్దాలని సంకల్పించారు. అనుకొన్నట్టుగానే ఆలయం రూపుదిద్దుకొన్నది. నాలుగెకరాలకు విస్తరించింది. దానికి కారణం.. రిటైనింగ్ వాల్. దాన్ని నిర్మించేందుకు నిపుణులు పడ్డ కష్టం అంతాఇంతా కాదు. ఏకంగా 100 అడుగుల కింది నుంచి, రాయిని బేస్ చేసుకొని నిర్మించారు. ఆ గోడ విశేషాలను ప్రముఖ జియో టెక్నికల్ ఇంజినీర్, యాదగిరిగుట్ట ఆలయ నిపుణుల కమిటీ సభ్యుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ బాబూరావు ‘నమస్తే తెలంగాణ’కు వెల్లడించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
అంచనాకు రావడానికే ఏడాది పట్టింది
నల్లగొండ జిల్లాలో దేవరకొండ, లతిఫ్సాప్ గుట్ట, కాపురాల గుట్ట, రాయగిరి గుట్టల్ల్లో యాదాద్రి గుట్ట ఒకటి. ఈ గుట్టలు అన్ని చూడటానికి ఒకే రాయిలా కనిపిస్తాయి. తొలిస్తే లోపల పెద్ద పెద్ద గుండ్లు అన్నీ కలిసి ఒక గుట్టలా ఏర్పడి ఉంటాయి. యాదాద్రి కూడా అంతే. గుడి విస్తరణ ఎలా చేయాలన్న అంచనాకు రావటానికే ఏడాది పట్టింది. ఎలాంటి పనులు చేయాలి.. చుట్టూ గోడ కట్టేందుకు ఏం చేయాలి అని లెక్కలేసుకొన్నాం.
స్వస్థలం మునుగోడు..
డాక్టర్ బాబూరావు స్వస్థలం నల్లగొండ జిల్లా మునుగోడు. ఉస్మానియా యూనివర్సిటీలో బీఈ, రూర్కీ ఐఐటీలో ఎంఈ, యూఎస్ఏలో పీహెచ్డీ చేశారు. ఉస్మానియాలో సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ హెడ్‌గా పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్ జియో టెక్నాలజీస్‌లో ప్రిన్సిపల్ కన్సల్టింగ్ జియోటెక్నికల్ ఇంజినీర్‌గా ఉన్నారు. యాదగిరిగుట్ట ఆలయ పునఃనిర్మాణ సమయంలో నిపుణుల కమిటీ సభ్యుడిగా ఈయన్ని ప్రభుత్వం నియమించింది.
100 అడుగుల కింద రాయిని బేస్ చేసుకొని..
రిటైనింగ్ వాల్ కోసం గుట్ట చుట్టూ 30 మీటర్లు అంటే 100 అడుగుల కింది నుంచి గోడలేపుకొంటూ వచ్చాం. ఇందుకు చాలా పరిశోధన చేశాం. దాదాపు 50 అడుగుల లోపలికి డ్రిల్లింగ్ చేసి అక్కడుండే రాయిని బయటకి తీశాం. ఆ రాయి గట్టిదనాన్ని పరిశీలించాం. ప్రతి పది మీటర్లకు ఒకటి చొప్పున 500 మీటర్ల గోడకోసం 47 చోట్ల బోర్‌వెల్‌తో రంధ్రాలు చేసి శాంపిల్స్పరిశీలించాం. అంతా బాగున్నదనుకొన్నాకే రాయిని ఆధారంగా చేసుకొని గోడ కట్టుకొంటూ వచ్చాం. వంద అడుగుల ఎత్తైన గోడ దేశంలోనే లేదు. హెవీ స్టీల్‌తో నిర్మించాం. తరువాత ఖాళీ మొత్తాన్ని మట్టితో నింపాం.గోడ నిర్మించడం ఒక ఎత్తు అయితే.. ఆ గోడను, పాత గుట్టను కలుపుకొంటూ ప్రధాన ప్రాకారంపైన దాన్నినిలబెట్టడానికి గుట్టలోఉన్న పెద్ద పెద్ద గుండ్ల మధ్యన ఖాళీని నింపాల్సి వచ్చింది. అన్నింటికంటే కష్టమైన వర్క్ ఇదే.. గుట్ట రిటైనింగ్ వాల్ స్ట్రాంగ్‌గా లేకపోతే మొత్తం దేవాలయమే వీక్ అయిపోతుంది. గుండ్ల మధ్యలో డ్రిల్ చేసి అడ్డం, నిలువు భారీ స్టీల్ వేసి, సిమెంట్‌తో బండరాళ్ల మధ్య ఉన్న గ్యాప్‌ను, పగుళ్లను ఫిల్ చేసి ఫౌండేషన్ వేశాం. ఎంత బరువు, ఒత్తిడి పడినా తట్టుకొనేలా డిజైన్ చేశాం.
గర్భగుడిని.. ఆంజనేయస్వామిని ముట్టుకోలేదు..
ఆలయ ప్రాంగణాన్ని విస్తరించేందుకు పాత ఆలయాన్ని కూల్చాల్సి వచ్చింది. గర్భగుడిని, లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ద్వారపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామి గుడిని ముట్టుకోలేదు. లక్ష్మీ నరసింహస్వామి బలం మొత్తం ఆంజనేయస్వామి దగ్గరే ఉన్నదంట.. అందుకని దాన్ని కూడా ముట్టుకోవద్దన్నారు. ఈ రెండింటిని వదిలేసి మొత్తం కూలగొట్టాం. కొంతమేర గుట్టను తొలిచాం.. ఈ క్రమంలో ఆంజనేయస్వామి ఉన్న ఆలయం పక్కన కొంత గుట్టను తొలచాల్సి వచ్చింది. ఆలయం ఆధారశిల చుట్టూ కొంత తవ్వుకువచ్చాం. నెల రోజులకు ఆ రాయి విచ్చుకొన్నది. చుట్టూ ఉన్న బండను తొలగించడంతో చిన్న గీత లాంటి చీలిక ఏర్పడింది. దేవాలయానికి ఏం కాలేదు. నేను పరిశీలించి.. ఆలయానికి ఏం కాలేదని నిర్ధారించుకొని చీలికకు రాక్ స్ట్రిచ్చింగ్ చేశాం. కొద్ది రోజులకే ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశాం.
సిమెంట్ వాడలేదు..
సిమెంట్ లైఫ్ 70 నుంచి 100 సంవత్సరాలే… కానీ ఆలయం వెయ్యేండ్లు ఉండాలి. ఆగమశాస్త్రం ప్రకారం ‘సున్నం, ఫైబర్ (జనపనార), బెల్లం, కరక్కాయ (హరిత కాయ) కలిపి గ్రైండింగ్ చేసి మిశ్రమాన్ని తయారుచేసి ల్యాబ్‌లో టెస్ట్ చేసి.. ఆలయ నిర్మాణంలో రాళ్ల మధ్య గ్యాప్‌ను నింపడానికి ఉపయోగించాం. హైదరాబాద్‌లో సెంటర్ మెటీరియల్ రిసెర్చ్ టెస్టింగ్ వాళ్లు దాన్ని ఓకే చేశారు. గుంటూరు నుంచి సున్నం.. వికారాబాద్ జిల్లా నుంచి కరక్కాయ తెప్పించి వినియోగించాం. ఆలయ బాహ్య ప్రాకారం.. అంతర ప్రాకారం.. బ్రహ్మోత్సవ ఊరేగింపు ప్రాకారం.. 22 మీటర్ల ఎత్తు, 12 వేల టన్నుల బరువున్న ఐదంతస్తుల ప్రధాన గోపుర నిర్మాణం.. ఇవన్నీ రిటైనింగ్‌వాల్ నిర్మాణంతోనే సాధ్యమయ్యాయి. అది కట్టాకే ఒకప్పుడు నాలుగు ఎకరాల్లో కనిపించిన యాదాద్రి గుట్ట.. ఇప్పుడు 14 ఎకరాల భారీ విస్తీర్ణంలో కనిపిస్తుంది. ప్రతిష్ఠాత్మక యాదాద్రి ఆలయ పునఃనిర్మాణంలో భాగస్వామిని కావడం నా అదృష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా.
కృష్ణశిలకు.. అల్ట్రాసోనిక్ పల్స్ డొలాస్టీ టెస్టింగ్..
ఆలయానికి ఉపయోగించే రాయి కోసం చాలా రాళ్లను పరిశీలించాం. హైదరాబాద్‌లో గ్రానైట్ రాయి పలుకులుగా ఉంటుంది. దానికంటే గట్టిదైన కృష్ణశిల డోలరైట్ (నల్లరాయి)ను ఎంపిక చేసుకొన్నాం. ప్రతి చదరపు సెంటిమీటర్‌కు 1300 కిలోగ్రాముల లోడ్‌ను తీసుకోగలదు. గుంటూరు జిల్లా గురజాలపల్లి నుంచి ఈ రాయిని 2000 టన్నుల వరకు తెచ్చుకొన్నాం.. రోజూ లారీల కొద్ది రాయి వచ్చేది. కానీ వచ్చిన రాయి మంచిదా.. కాదా.. అనేది తెలుసుకోవాలి కదా.. సహజంగా కొన్ని రాళ్లు బయటికి చూడటానికి బాగానే ఉన్నా.. లోపల రంధ్రాలు ఉంటాయి. ఇవి అలా లేకుండా చెక్ చేసుకోవాలి. అందుకోసం అల్ట్రాసోనిక్ పల్స్ డొలాస్టీ టెస్టింగ్.. అంటే రాయిమీద నుంచి ఒక పల్స్ (సౌండ్) పంపిస్తాం. అది ఒక సెకన్‌కు ఐదువేల మీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. లోపల ఎక్కడైనా రంధ్రం ఉంటే ఆ పల్స్ ప్రయాణ సమయం పెరుగుతుంది. ఇలా ప్రతి రాయినీ వదలకుండా పరీక్షించాకే ఓకే చేశాం.