రామగిరి, జూన్ 03 : ఉపాధ్యాయులకు పెద్ద ఊరట. ఏటా జరిగే రెండు సాధారణ టెట్ (TET) లతో పాటు, ఇన్-సర్వీస్ టీచర్ల కోసం రెండు ప్రత్యేక టెట్లు నిర్వహించడానికి అనుమతి మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు (మెమో నం. 2691/Ser.III/2026-2) జారీ చేయడం అత్యంత అభినందనీయమని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ పేర్కొంది. 31 ఆగస్టు, 2028 లోగా ఇన్-సర్వీస్ టీచర్లందరూ తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని అపెక్స్ కోర్ట్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ గడువును దృష్టిలో ఉంచుకుని, ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం టీఆర్టీఎఫ్ సహా పలు ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని బలంగా తీసుకెళ్లినందున ప్రత్యేక టెట్ నిర్వహణ ఉత్తర్వులు వచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఇన్-సర్వీస్ టీచర్లందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విజయవంతంగా టెట్ పూర్తి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు టీఆర్టీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నిమ్మనగోటి జనార్ధన్, జిల్లా ప్రధాన కార్యదర్శి తరాల పరమేశ్ యాదవ్ పేర్కొన్నారు.