భోపాల్: ‘హనీ-ట్రాప్’ ముఠాకు చెందిన నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా ఆమెకు హెచ్ఐవీ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆమె ట్రాప్ చేసిన పలువురు మగవారికి ఎయిడ్స్ సోకి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. (Honey-Trap) మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. దేహత్ ప్రాంతానికి చెందిన 60 ఏళ్ల రైతును ఒక మహిళ లిఫ్ట్ అడిగింది. తన కాలుకు నొప్పిగా ఉన్నదని, తనను ఇంటి వద్ద చేర్చాలని కోరింది. ఆమె నివాసానికి చేరుకున్న తర్వాత టీ తాగడానికి లోపలికి రమ్మని ఆ రైతును ఒప్పించింది. ఆ తర్వాత అతడిని అభ్యంతరకరమైన స్థితిలో ఇరికించి రహస్యంగా వీడియో రికార్డ్ చేసింది.
కాగా, ‘హనీ-ట్రాప్’ ముఠాకు చెందిన వ్యక్తులు ఆ వెంటనే వృద్ధ రైతును బ్లాక్మెయిల్ చేశారు. రూ. 7 లక్షలు చెల్లించకపోతే తప్పుడు అత్యాచార కేసులో ఇరికిస్తామని బెదిరించారు. భయపడిన ఆ రైతు తొలుత రూ. 5,000 చెల్లించాడు. ఒత్తిడి పెరగడంతో డబ్బు కోసం తన వ్యవసాయ భూమిని అమ్మడానికి సిద్ధపడ్డాడు. చివరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు.
మరోవైపు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితురాలైన ఆ మహిళను అరెస్ట్ చేశారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షలో ఆమెకు హెచ్ఐవి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. గత మూడేళ్లుగా యాంటీరెట్రోవైరల్ థెరపీ (ఏఆర్టీ) చికిత్సను ఆమె తీసుకుంటున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. దర్యాప్తు తర్వాత ఆ ముఠాకు చెందిన ఇద్దరు పురుషులు, మరో మహిళను కూడా అరెస్ట్ చేశారు.
అయితే నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లను పోలీసులు పరిశీలించారు. 15 నుంచి 16 మంది పురుషులకు సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోలు బయటపడ్డాయి. ఆ వ్యక్తుల్లో కనీసం ఆరేడు మందికి నిందితురాలైన మహిళతో శారీరక సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానించారు. దీంతో వారికి ఎయిడ్స్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేథప్యంలో ఆ వ్యక్తులను గుర్తించడంతోపాటు వైద్య పరీక్షలు, కౌన్సెలింగ్ కోసం ప్రయత్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.