Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య తన కెరీర్లో ఎదురైన బిగ్గెస్ట్ సెట్‌బ్యాక్స్ మరియు విజయాల గురించి తాజాగా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గతంలో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘కంగువ’ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంపై ఆయన స్పందించారు. సినిమా రంగంలో ఫలితాలను ఎప్పుడూ ముందుగా అంచనా వేయలేమని తెలిపిన సూర్య. ఇండస్ట్రీలో 30 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ, ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకుంటూనే ఉన్నానని పేర్కొన్నారు.
సినిమా ఫలితాల గురించి వివరిస్తూ.. ఒక చిత్రం కోసం దాదాపు 200 రోజులకు పైగా, అర్ధ సంవత్సరం పాటు ఎంతో కష్టపడి విశ్వాసంతో పని చేసినప్పటికీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పూర్తిగా నిరాశపరిచిందని తెలిపారు. అదే సమయంలో కేవలం 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న మరో సినిమా ఆ సంవత్సరపు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిందని అన్నారు. ‘కంగువ’ చిత్రం భారీ బజ్ మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద నిరాశపరచగా, ఆ తర్వాత ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన ‘కరుప్పు’ సినిమా సూర్య కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
ఇదే ఇంటర్వ్యూలో లోకేష్ కనగరాజ్ సినిమా యూనివర్స్‌లోని మోస్ట్ అవేటెడ్ రోలెక్స్ పాత్ర గురించి కూడా సూర్య క్లారిటీ ఇచ్చారు. రోలెక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే దానిపై తనకు కూడా స్పష్టత లేదని, లోకేష్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమాతో పాటు ‘విక్రమ్ 2’ పనులతో బిజీగా ఉన్నారని తెలిపారు. అయితే లోకేష్ మాత్రం ఇంటర్వ్యూలలో రోలెక్స్ స్క్రిప్ట్ రాస్తున్నానని చెబుతున్నారని, సరైన సమయం వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు ‘ఆవేశం’ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వంలో తన హోమ్ ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమా షూటింగ్ నిన్ననే పూర్తయిందని, ఈ సినిమా ఈ ఏడాది చివరి నాటికి ప్రేక్షకుల ముందుకు రానుందని సూర్య అధికారికంగా ప్రకటించారు.