Donald Trump : అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా అయతొల్లా ఖమేని గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బహుశా ఏదో సమయంలో మొజ్తాబా ఖమేనిని కలుస్తానని చెప్పారు. అయితే, ఇంతవరకు తనకు ఆయనను కలిసే అవకాశం రాలేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మొజ్తాబా ఆరోగ్యం సరిగ్గా లేదన్నారు. ట్రంప్ తాజాగా మీడియాతో మాట్లాడారు.
తాను ఏదో ఒక సందర్భంలో అయతొల్లా ఖమేనిని కలుస్తానన్నారు. ఇరాన్–అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమైన మొదటిరోజునే మొజ్తాబా తండ్రి, ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేని సహా పలువురు కుటుంబ సభ్యులు మరణించారు. అమెరికా జరిపిన బాంబు దాడిలో వారు ప్రాణాలు కోల్పోయారు. అయితే, మొజ్తాబా ఖమేని తృటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం ఆయనకు రహస్యంగా చికిత్స కొనసాగుతోందని ప్రచారం జరుగుతోంది. ఆయన కోమాలో ఉన్నారనే మరో ప్రచారం కూడా ఉంది. ఏదేమైనా మొజ్తాబా ఖమేని భద్రత రీత్యా ఆయనకు సంబంధించిన వివరాలేవీ బయటకు రావడం లేదు.
మరోవైపు ఇరాన్‌తో తాజా పరిణామాలపై ట్రంప్ స్పందించారు. అణ్వాయుధ తయారీని విడిచిపెట్టేందుకు ఇరాన్ అంగీకరించిందన్నారు. అయితే, ఇరాన్ తన నిర్ణయం మార్చుకోవచ్చని, అదే పెద్ద సమస్య అని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా ఉండేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమన్నారు. ఇదే సమయంలో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు నిలిచిపోయాయని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అదంతా తప్పుడు ప్రచారం అని కొట్టిపారేశారు. ఇరాన్‌తో తాము వరుసగా చర్చలు జరుపుతున్నామన్నారు. మొన్న, నిన్న, ఇవాళ కూడా చర్చలు జరిపామని తెలిపారు.
ఇప్పటికే ఇరాన్‌తో చర్చలు 47 రోజులుగా సాగుతున్నాయని, ఇంకా ఎక్కువ కాలం ఈ చర్చల్ని పొడిగించదలచుకోలేదని ట్రంప్ తేల్చి చెప్పారు. ఒకవైపు అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. ఇరాన్‌లోని దీవులపై అమెరికా దాడులు చేస్తోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది.మరోవైపు లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి చేస్తోంది.