సిటీబ్యూరో, జనవరి 2(నమస్తే తెలంగాణ): కంటికి కనిపించని సన్నదారం తమ గొంతు కోసేస్తుండడంతో నగరవాసులు ప్రత్యేకించి వాహనదారులు భయపడుతున్నారు. నిషేధిత చైనామాంజా వాహనదారుల పాలిట యమపాశంగా మారుతోంది. సరదా కోసం ఎగురవేస్తున్న గాలిపటాలు అమాయకుల ప్రాణాలమీదకు తెస్తున్నాయి. సింథటిక్ నైలాన్ లేదా ప్లాస్టిక్ దారానికి గాజు పొడి, లోహధూళి వంటి పదునైన పదార్థాలు పూత పూసి తయారు చేసిన ఈ చైనా మాంజా ప్రాణాంతకంగా మారుతోంది. పతంగి తెగకుండా ఉండడంతో పాటు ఎదుటివారి పతంగిని సులభంగా తెంపుతుందన్న కారణంతో యువత ఎక్కువగా ఈ మాంజాను ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతోంది.
గప్‌చుప్‌గా మాంజా అమ్మకాలు
తెలుగురాష్ర్టాల్లో సంక్రాంతి వేళ గాలిపటాలు ఎగురవేస్తూ చైనామాంజాను వాడడం ప్రమాదాలకు దారితీస్తోంది. పతంగులు చెట్లకు, విద్యుత్ స్తంభాలకు చిక్కుకున్నప్పుడు అక్కడే మాంజా వేలాడుతుండడంతో పక్షులు, జంతువులకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. ద్విచక్రవాహనదారులు, పిల్లలు ఈ మాంజాకు తగిలి తీవ్రగాయాలు, కొన్నిచోట్ల చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. చైనా మాంజా అమ్మకం, వినియోగంపై నిషేధం ఉన్నప్పటికీ వ్యాపారులు దొంగచాటుగా విక్రయిస్తున్నారు. ఢిల్లీ, యూపీ, మీరట్ తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా నగరానికి దిగుమతి చేసుకుని ఈ దందా చేస్తున్నారు. టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు కలిసి దాడులు చేసినా వీరి వ్యాపారం కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి వరకు స్పెషల్ డ్రైవ్
సౌత్‌జోన్, ఈస్ట్‌జోన్ సౌత్ఈస్ట్ జోన్, సౌత్‌వెస్ట్ జోన్లలో ఎక్కువగా చైనా మాంజా అమ్మకాలు జరుగుతాయని, ఈ మాంజా అమ్మకాలపై స్పెషల్ డ్రైవ్ పెట్టామని, సంక్రాంతి వరకు ఈ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చెప్పారు. పాతబస్తీలో చైనా సింథటిక్ నైలాన్ గ్లాస్ కోటెడ్ మాంజా అక్రమంగా విక్రయిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారని పోలీసులు తెలిపారు. రెండు వేర్వేరు కేసుల్లో అక్రమంగా చైనా మాంజా విక్రయిస్తున్న వ్యక్తులపై కేసులు పెట్టామని, మొత్తం 24 చైనా మాంజా బాబిన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. చైనా మాంజా కొనుగోలు చేసినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్ హెచ్చరించారు.
ఈ కామర్స్ సంస్థలపై ఫిర్యాదు
చైనామాంజా క్రయవిక్రయాలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో అడ్వకేట్ రామారావు ఫిర్యాదు చేశారు. గత వారం నగరంలో జరిగిన ఘటనల నేపథ్యంలో హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశామని ప్రముఖ న్యాయవాది రామారావు తెలిపారు. దీంతో పాటు ఆన్లైన్ కేంద్రంగా చైనా మంజా విక్రయిస్తున్న అమెజాన్, మీషో, పతంగ్దోరీ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ సంస్థలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. దీంతో ఎన్హెచ్ఆర్సీ ఆయా సంస్థలపై కేసు నమోదు చేసిందని రామారావు పేర్కొన్నారు.
53కేసులు నమోదు
గత సంవత్సరం లంగర్‌హౌస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మీద ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఒక ఆర్మీ జవాన్ మెడకు చైనీస్ మాజా తాకడంతో తీవ్రంగా గాయపడిన జవాన్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. గతంలో ఎల్బీనగర్ ప్రాంతంలో తల్లిదండ్రులతో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తున్న చిన్నారి మెడకు మాంజా కోసుకోవడంతో మృత్యువాత పడింది. పాతబస్తీ నవాబ్‌సాబ్‌కుంటకు చెందిన జమీల్ అనే యువకుడు తన బైకుపై చార్మినార్ వైపు వెళ్తుండగా షంషీర్గంజ్ వద్ద గొంతుకు మాంజా తగలడంతో గొంతు తెగింది. దాంతో పాటు ఆయన మెడ, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. అతనిని ఆసుపత్రికి తరలించగా 22 కుట్లు పడ్డాయని జమీల్ తండ్రి చెప్పారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. గతవారం కీసరలోని మల్లికార్జున నగర్లో చైనా మాంజా కారణంగా జశ్వంత్‌రెడ్డి అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. జశ్వంత్ బైక్‌పై వెళ్తుండగా నైలాజన్ మాంజా మెడకు చుట్టుకోవడంతో గొంతు భాగం తీవ్రంగా తెగిపోయింది. గాయం లోతుగా ఉండడంతో అతనికి 19 కుట్లు పడ్డాయి. ఈ నేపథ్యంలో పోలీసు స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు చైనీస్ మాంజా విక్రయదారులపై 53 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల సూచనలు