బాన్సువాడ, ఏప్రిల్ 25: అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసనసభాపతి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ర్టాల ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణలో కలుపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని చెప్పారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బాన్సువాడ పట్టణ సమీపంలో ఉన్న ఎస్ఎంబీ ఫంక్షన్‌హాలులో మంగళవారం పార్టీ ప్రతినిధుల సభ నిర్వహించారు. సమావేశానికి ముందు బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్‌రెడ్డి ఎగురవేశారు. తెలంగాణ తల్లి చిత్రపటం, అమరవీరుల స్థూపం వద్ద సభాపతి పోచారం, డీసీసీబీ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్‌రెడ్డి అమరవీరులకు నివాళులు అర్పించి, రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం మాట్లాడుతూ.. ప్లీనరీ సమావేశానికి తాను బాన్సువాడ ఎమ్మెల్యేగా మాత్రమే హాజరైనట్లు తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలు ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. కేంద్రంలో బీఆర్ఎస్ పాలనతోనే తెలంగాణ పథకాలు దేశమంతటా అమలవుతాయన్నారు. అందుకే ఇతర రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజక వర్గ అభివృద్ధికి రూ. 10 వేల కోట్ల నిధులు వచ్చినట్లు చెప్పారు. ఎవరైనా నియోజకవర్గ అభివృద్ధిపై విమర్శలు చేస్తే వారికి అభివృద్ధి పనులు, సంక్షేమ రంగాల నిధుల వివరాలు తెలుపాలని కార్యకర్తలకు సూచించారు. కొంతమందికి కండ్లు ఉండి కూడా అభివృద్ధి, సంక్షేమం కనబడడంలేదన్నారు. వారందరి కోసం బాన్సువాడలోని తన నివాస ప్రాంగణంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల లబ్ధిదారులతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని, వచ్చి చూడవచ్చని సూచించారు.
తొమ్మిదేండ్లలో బాన్సువాడలో రూ.10 వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లు స్పీకర్ తెలిపారు. నియోజకవర్గానికి 11వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరుకాగా.. మౌలిక వసతులతో కలిపి రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేశామని వివరించారు. మొదటి విడుత గొర్రెల పంపిణీలో భాగంగా 3, 140 మంది లబ్ధిదారులకు రూ.100 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.రహదారు నిర్మాణానికి రూ. వెయ్యి కోట్లు కేటాయించినట్లు తెలిపారు.సాగునీటి రంగంలో డిస్ట్రిబ్యూటరీ తదితర పనులు, మిషన్ కాకతీయ, నిజాంసాగర్ప్రధాన కట్టల బలోపేతం తదితర పనులకు రూ. 200 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బాన్సువాడ మున్సిపల్ పరిధిలో సుమారు రూ.400 కోట్లతో అభివృద్ధి పనులు జరిగినట్లు చెప్పారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కోసం సబ్సిడీ రూ .వెయ్యి కోట్లు చెల్లించినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకానికి రూ. 800 కోట్లు కేటాయించామన్నారు. నియోజక వర్గంలో పోడుభూముల సర్వే పూర్తయిందని , త్వరలోనే అర్హులకు పాస్‌పుస్తకాలను అందజేస్తామన్నారు. రైతుబంధు సమతి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్, మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.